బాసర.. చదువుల తల్లి కొలువైన క్షేత్రం. అక్షరాభ్యాసం కోసం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అమ్మవారి ముంగిట అక్షరం దిద్దితే ఉన్నతంగా ఎదుగుతామన్న నమ్మకం వారిది. ఇంతటి పవిత్రమైన ఆలయం నుంచి ఉత్సవ విగ్రహం తరలిపోయింది. అలా బయటకు తీసుకురావటం శాస్త్రవిరుద్ధమే కాదు.. అపచారం కూడా. మరి చదువులమ్మకు సంకెళ్లు వేసింది ఎవరు? బందోబస్తు ఉన్నా విగ్రహం బాసర ఎలా దాటింది? సీసీ కెమెరాలు ఏమైనట్టు? సెక్యూరిటీ ఎక్కడిపోయినట్టు? విగ్రహం అదృశ్యంలో పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? బాసరలో బయటకు రాని నిజాలు ఏం చెబుతున్నాయ్.?
కాసుల కోసం పూజరులు కక్కుర్తిపడ్డారా? అయ్యవార్లు అడ్డదారుల్లో నడిచారా? లేక ఎవరైనా నడిపించారా? సూత్రధారులను తప్పించే ప్రయత్నంలో పాత్రధారులను ఇరికించారా? శాస్త్రవిరుద్ధమే కాదు అపచారమని తెలిసినా ఎందుకింత అరాచకంగా వ్యవహరించినట్టు? నియమాలను, సిద్ధాంతుల సూచనలను పక్కనపెట్టిన అమ్మవారి రూపానికి ప్రతిరూపంగా భావించే ఉత్సవ విగ్రహాన్ని పూజారులు పొలిమేరలు దాటించారు. దేవరకొండకు తరలించారు. సెంటిమెంట్‌కే శఠగోపం పెట్టేశారు. ప్రధాన ఆలయం గడప దాటడమే పాపమనుకుంటే ఏకంగా జిల్లాల దాటించేశారు. పెద్దవారి పైరవీలకు భయపడ్డారా? నాలుగు కాసులకు ఆశపడ్డారా?
అమ్మ రూపానికి ప్రతిరూపంగా భావించి శరన్నవరాత్రుల్లో, వసంత పంచవి వేడుకలలో ఉత్సవ విగ్రహాన్ని పుర వీధుల్లో ఊరేగించి సామాన్య జనానికి దర్శనభాగ్యం కల్పిస్తారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఉత్సవ విగ్రహాన్ని సరిహద్దులు దాటించడమే అసలు వివాదానికి కారణం.
దేవరకొండలో రెండ్రోజుల పాటు అక్కడే పూజాధికాలు నిర్వహించారు. విషయం బయటకు రావటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయ్యవారు సంజీవ్ అజ్ఞాతంలోకి చేరారు. తరువాత ఆసుపత్రిలో చేరారు. అసలు విగ్రహం ఎలా బయటకు వెళ్లిందని ఆరాతీసిన హెచ్‌ఎంటీవీకి సంజీవ్ చెప్పిన రహస్యమేంటో వీడియో లో వినండి.
కానీ బయటకు రాని ఇంకో నిజం బయట ప్రపంచానికి తెలియదు. అంతెందుకు అక్కడే ఉన్న అధికారులూ ఇది విని దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మవారి విగ్రహ తరలింపు ఇదేమీ కొత్తకాదట. బాసర నుంచి అమ్మవారి ప్రతిరూపాన్ని తరచూ బయటకు తీసుకెళ్లటం సర్వసాధారణమేనట. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరగుతుందని హెచ్‌ఎంటీవీ పరిశోధనలో తేలింది. విషయం బయటపడితే పరువు పోతుందన్న భయంతోనే ఇన్నాళ్లు దాన్ని అలా దాచి పెట్టినట్టు బయటపడింది. ఒకరిద్దరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటంతో వారంతా కోర్టు కెళతారనే భయంతో ముందుగానే ప్రభుత్వ పెద్దలు కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. విషయం ముఖ్యమంత్రి వద్దకు చేరడం సీఎం సీరియస్ అవడంతో ఇందులో భాగం పంచుకున్న ఖద్దరు నేతలకు భయం పట్టుకుందన్నది ఆఫ్ ది రికార్డ్.