ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓ వార్త తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. సీఈఓ పదవి నుంచి జుకర్ బర్గ్ తప్పుకోవాలని సంస్థ పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ, పబ్లిక్ అఫైర్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్ తప్పుకోవాలని పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ఫేస్‌బుక్‌లో అధిక వాటా ఉన్న ట్రిల్లియం అసెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొనాస్ క్రాన్, జుకెర్‌బర్గ్‌ను బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారంటూ ది గార్డియన్ మరో కథనాన్ని ప్రచురించింది.