ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ టికెట్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అక్కడ టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సామ రంగారెడ్డికే బీఫాం దక్కింది. సామ రంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని టీడీపీ రెండు రోజుల కిందట ప్రకటించినా ఆయనకు పార్టీ నిన్న బీఫాం ఇవ్వలేదు. ఇదే సమయంలో ఆయనను టీఆర్‌ఎస్ హైజాక్ చేసిందంటూ ఇదే సెగ్మెంట్ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. సామను బరిలోకి దింపితే బలిపశువు అయినట్లేనని అన్నారు.
ఇదే సందర్భంలో ప్రజా కూటమి తరఫున మల్‌రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన ఇబ్రహీంపట్నం నుంచి రెబల్‌గా పోటీ చేసి ఓటమి చవిచూశారు. రెబల్‌గా పోటీ చేయడంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. ఏడాది కిందట ఈ సస్పెన్షన్ ఎత్తివేసింది. బీఫాం పెండింగ్‌లో ఉంచడంపై ఇక్కడ అభ్యర్థిని మారుస్తారా? అన్న అంశం చర్చనీయాంశమైంది. అయితే, సామ రంగారెడ్డికి ఇవాళ ఉదయం బీఫారం అందజేశారు టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.
రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు సామ రంగారెడ్డి నిన్న సాయంత్రం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. నందమూరి సుహాసిని, వీరేందర్ గౌడ్, కూన వెంకటేశ్‌గౌడ్, ముజాఫర్, ఆనంద ప్రసాద్‌కు బీఫాంలు ఇచ్చి సామ రంగారెడ్డికి పెండింగ్‌లో పెట్టారు. తన అనుచరులతో కలిసి రాత్రి 8 గంటల వరకూ ఆయన బీఫాం కోసం ఎదురుచూసి వెళ్లిపోయారు. అయితే, అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన రొక్కం భీంరెడ్డి తనకు ఇబ్రహీంపట్నం టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం టిక్కెట్టు సామ రంగారెడ్డికా..? భీంరెడ్డికా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఆ సీటు ఎట్టకేలకు సామ రంగారెడ్డికే దక్కింది.