బాసర అమ్మవారి ఉత్సవ విగ్రహం అదృశ్యంపై ఉత్కంఠ వీడింది. అమ్మవారి విగ్రహం లభ్యమైంది. తహశీల్దార్ సమక్షంలో ఆలయ అధికారులు రెండు బీరువాలు తెరిచారు. పూజారి సంజయ్ కుమార్ బీరువాలో విగ్రహం లభించింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం అదృశ్యంపై గత కొద్దిరోజులుగా ఉత్కంఠ కొనసాగింది. విగ్రహం అదృశ్యంలో ఆలయ అర్చకుడి పాత్ర ఉందంటూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉత్సవ విగ్రహాం అదృశ్యంపై పెద్ద వివాదమే నడిచింది. ఆలయ అధికారులు బీరువాలను తెరవడంతో విగ్రహం అదృశ్యంపై ఉత్కంఠకు తెరపడింది. తహశీల్దార్ సమక్షంలో అధికారులు ఆలయంలోని రెండు బీరువాలు తెరిచారు. మొదటి బీరువాలో వెండి గద, పళ్లెం, అమ్మవారి అలంకరణ సామాగ్రి మాత్రమే లభ్యమయ్యాయి. తర్వాత, పూజారి సంజయ్ కుమార్ కు చెందిన రెండో బీరువా తెరవడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహం లభ్యమైంది.
దొరికిన విగ్రహం భక్తులు ఇచ్చిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయినా, స్టోరు రూమ్ లో ఉండాల్సిన విగ్రహం బీరువాలోకి ఎలా వచ్చిందనేపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ కుమార్ బీరువాలో అమ్మవారి విగ్రహం లభించినా అదృశ్యమైన విగ్రహం ఇదేనా, కాదా అనేది విచారణలో తేలనుందని పోలీసులు తెలిపారు.
మరోవైపు, ఉత్సవ విగ్రహంపై అనవసర రాద్ధాంతం చేశారని పూజారి సంజయ్ ఆరోపించారు. విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్లలేదని, ఆలయంలోనే ఉందని చెప్పినా వినిపించుకోలేదని చెప్పారు. కక్షపూరితంగా తనపై కేసులు నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు.