ఇటీవల రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మొన్న పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగిన ఘటన మరవకముందే టర్కీ రాజధాని అంకారాలో మరో రైలు ప్రమాదం వెలుగులోకి వచ్చింది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ రైలు, మరో రైలింజన్‌ని ఢీకొట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, 47 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మర్సాండిజ్‌లోని చికిత్స సెంటర్కు తరలించారు. సిగ్నలింగ్ వ్యవస్థలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అంకారా రైల్వే స్టేషన్‌కు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంపై టర్కీ అధ్యక్షుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలపై ఆరాతీశారు.