అమెరికాను మరో సారి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని అత్యవసర, కీలక విభాగాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. అమెరికాలో ఇలా జరగడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించకుండానే, అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ అడిగిన 500 కోట్ల డాలర్ల డబ్బుపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే సభ వాయిదా పడింది. అమెరికా షట్ డౌన్‌తో సుమారు 8లక్షల మంది ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థతి నెలకోంది.. అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి వేతనం లేని సెలవులు లభించనుండగా, మరికొందరు జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని డెమెక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా ద్రవ్య వినిమయ బిల్లు సకాలంలో కాంగ్రెస్ అమోదించకపోయినా, అధ్యక్షుడు సంతకం చెయ్యకపోయినా పాలన స్తంభిస్తుంది. ఈ సారి కొంత ఎక్కువ కాలం స్థంభన కొనసాగుతుందనీ, దానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధికారం చేపట్టాకా షట్‌డౌన్ అమలు కావడం ఇది మూడో సారి. ఈ ఏడాది జనవరి, జూన్ నెలలలో కూడా కొన్ని రోజుల పాటు పాలన స్తంభించింది.