చుండ్రు మనకు అనేక కారణాల వల్ల వస్తుంది. దీంతో తలపై ఉన్న చర్మం పొట్టుగా మారి రాలుతుంది. ఒత్తిడి, మానసిక ఆందోళన, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, పోషణ లోపం వంటి అనేక కారణాలు చుండ్రు రావడానికి కారణమవుతాయి. అయితే కింద సూచించిన విధంగా పలు చిట్కాలు పాటిస్తే దాంతో చుండ్రును సమర్థవంతంగా తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరినూనె, వేప నూనెలను ఉపయోగించి తయారు చేసిన హెయిర్ ఆయిల్‌ను వాడితే మంచిది. దీంతో చుండ్రు పోవడమే కాదు, జుట్టుకు పోషణ అందుతుంది. తద్వారా శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి కూడా. వెంట్రుకలు కాంతివంతంగా మారుతాయి.
2. కొబ్బరినూనె, ఆముదంలను కొద్దిగా సమపాళ్లలో తీసుకుని సన్నని మంటపై వేడి చేయాలి. అనంతరం చల్లారాక ఆ నూనెను వెంట్రుకలకు రాయాలి. ఇలా వారంలో 3, 4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
3. రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారుజామున వాటిని మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. తరువాత ఒక అరగంట పాటు జుట్టుకి ఈ పేస్ట్ ని బాగా పట్టించి కొంత సేపు వేచి ఉన్నాక తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, చుండ్రు బాధ తప్పుతుంది.
4. వేప ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి చల్లారాక ఆ నీటితో తలను కడిగితే చాలు, చుండ్రు పోతుంది.
5. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో టీ ట్రీ ఆయిల్‌ను ఒక టీస్పూన్ కలపాలి. బాగా కలిపాక ఈ నీటితో జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధించదు.
6. తులసి ఆకులు, ఉసిరి కాయలను కలిపి పేస్ట్ లా చేయాలి. ఉసిరి కాయ లేకపోతే పొడి వాడవచ్చు. ఆ పేస్ట్‌ను జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. వెనిగర్, నిమ్మ రసాలను సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని జుట్టుకు మర్దనా చేయాలి. అనంతరం 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు రాదు.
8. కలబంద గుజ్జుతో జుట్టుకు మర్దనా చేసి 15 నిమిషాలు అలానే వేచి ఉన్నాక తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు తొలగిపోతుంది.