దిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా భారత సైన్యం మరమనుషుల (రోబోలు) సహాయం తీసుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి రక్షణ వర్గాలు. సైనికులకు కావాల్సిన ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు రిమోట్ ఆధారిత రోబోలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇప్పటికే 544 రోబోల తయారీకి భారత సైన్యం ప్రతిపాదనలు పంపగా, రక్షణ మంత్రిత్వశాఖ వాటికి ఆమోదం తెలిపింది. వాటి కృత్రిమ మేధస్సుపై ప్రయోగాలు ప్రారంభమవగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాక సైన్యానికి అప్పగించనున్నారు.
ఈ రోబోలు ఉగ్రవాద ఏరివేత చర్యల్లో భాగంగా సైన్యానికి విశేషంగా సహాయ పడగలవట. పరిసరాల పర్యవేక్షణతో పాటు ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలుగా ఉండే అడవులు, మారుమూల గ్రామాల్లో సైతం ఇవి ఆటంకం లేకుండా పనిచేయగలవని అంటున్నారు. కశ్మీర్‌లో భద్రతా బలగాలకు ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ప్రతికూల వాతావరణం ఒకటి. ఈ రోబోల ద్వారా ఇటువంటి పరిస్థితులను అధిగమించడంతో పాటు తక్కువ దూరాలకు ఆయుధ సామాగ్రిని తరలించవచ్చని ఆర్మీ భావిస్తోంది.