SBI services down: ఎస్బీఐ సేవలు డౌన్... పేమెంట్స్ చేయలేక తిప్పలు పడిన కస్టమర్స్
SBI services down: ఎస్బీఐ సేవలు డౌన్... పేమెంట్స్ చేయలేక తిప్పలు పడిన కస్టమర్స్
SBI services down: ఎస్బీఐ సేవలకు మంగళవారం అంతరాయం ఏర్పడింది. ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేసుకోవడం వంటి సేవలు నిలిచిపోయాయి. ఉదయం 8:15 గంటల నుండి ఈ సమస్య తలెత్తింది. మధ్యాహ్నం 11:45 గంటల సమయంలో సమస్య తారాస్థాయికి చేరింది. ఆ సమయంలో ఎస్బీఐ సేవలు ఆగిపోవడంపై ఫిర్యాదుచేసిన వారి సంఖ్య 800 కు పైనే ఉంది. వెబ్‌సైట్ పర్‌ఫార్మెన్స్ ట్రాకర్ డౌన్‌డిటెక్టర్ ఈ వివరాలను వెల్లడించింది.
డౌన్‌డిటెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి 64 శాతం ఫిర్యాదులు వచ్చాయి. నగదు బదిలీ సేవలపై 33 శాతం మంది ఫిర్యాదు చేశారు. ఇక ఏటీఎం సేవలకు సంబంధించి మరో 3 శాతం వినియోగదారులు రిపోర్ట్ చేశారు.
ఎస్బీఐ సేవలకు అంతరాయం జరిగిన మాట వాస్తవమేనని ఆ సంస్థ కూడా అంగీరించింది. తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎస్బీఐ, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో జరిగే కార్యక్రమాల కారణంగా ఏప్రిల్ 1 న మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎస్బీఐ డిజిటల్ సర్వీసెస్ అందుబాటులో ఉండవు అని స్పష్టంచేసింది. ఆ సమయంలో ఎస్బీఐ కస్టమర్స్ యూపీఐ లైట్ లేదా ఏటీఎం సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా ఆ సంస్థ కోరింది.
ఈ సమస్య ఇతర బ్యాంకులకు కూడా ఉందా?
ఈ సమస్య కేవలం ఎస్బీఐకే కాదు, ఇతర బ్యాంకులకు తలెత్తిందా అంటే అవుననే తెలుస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందిస్తూ ప్రస్తుతం యూపీఐ సేవలకు ఇబ్బంది లేనప్పటికీ, ఇతర బ్యాంకుల డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొన్ని బ్యాంకుల సేవల్లో సమస్యలు తలెత్తుతున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ఆయా బ్యాంకుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు తాము కూడా కృషి చేస్తున్నట్లు ఎన్పీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే, కచ్చితంగా ఫలానా బ్యాంకు అనే పేరు మాత్రం ఎన్పీసీఐ వెల్లడించలేదు.