Why Nifty IT falling? సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పేరున్న ఐటి కంపెనీల స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి?

Why Nifty IT falling? సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పేరున్న ఐటి కంపెనీల స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి?
Why Nifty IT continuously falling: ఇండియాలో ఐటి కంపెనీల స్టాక్స్ వరుసగా కుప్పకూలుతున్నాయి. వరుసగా ఏడు సెషన్స్ నుండి ఐటి స్టాక్స్ నష్టాల్లోకి వెళ్తున్నాయి. నిఫ్టీ ఐటి ఇండెక్స్ రోజుకింత పతనమవుతోంది. ఇవాళ స్టాక్ మార్కెట్ ఓపెన్ అవడంతోనే నిఫ్టీ ఐటి 3% నష్టపోయింది. ఈ ఇండెక్స్‌లో ముందు వరుసలో ఉన్న 10 స్టాక్స్‌లో ఒక్క స్టాక్ కూడా లాభపడలేదు. ఈ పరిణామాలు ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారితీయనున్నాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గత 7 సెషన్స్‌లో నిఫ్టీ ఐటి 11 శాతంతో 3800 పాయింట్స్ మేర నష్టపోయింది. గత నెల రోజుల గణాంకాలు తీసుకుంటే 14% నష్టం, గత 3 నెలల నిఫ్టీ ఐటి ఇండెక్స్ 25% నష్టం పోయింది.
2024 డిసెంబర్ రెండోవారంలో గరిష్టంగా 46,000 పాయింట్స్ టచ్ అయిన ఐటి నిఫ్టీ ఇవాళ మధ్యాహ్నం 32,447 వద్ద కొనసాగుతోంది. అంటే ఈ 4 నెలల్లోనే సుమారు 11,550 పాయింట్స్ మేర నిఫ్టీ ఐటి నష్టపోయింది. నిఫ్టీ ఐటి పరిస్థితి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క లెక్క చాలు చాలు.
ఒకప్పుడు మిగతా సెక్టార్స్ నష్టాలబాటలో ఉన్నప్పటికీ, బంగారం తరువాత మళ్లీ ఐటి నిఫ్టీకే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సెక్టార్ అనే పేరు ఉండేది. మరి ఇప్పుడేమైంది? ఎందుకు నిఫ్టీ ఐటి ఇండెక్స్ ఇంతలా నష్టపోతోంది? ఏయే కంపెనీలు ఏమేర నష్టపోయాయి, ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో ఐటి స్టాక్స్ ఎంతలా నష్టపోతున్నాయంటే, వాటి ప్రభావం మొత్తం స్టాక్ మార్కెట్ పైనే కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే విప్రో 4.5 శాతం పడిపోయింది. ఎంఫాసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, టెక్ మహింద్రా లాంటి ఐటి కంపెనీలు ఒక్కొక్కటి 3 శాతం నష్టపోయాయి. ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు 2 శాతం నష్టపోయాయి. అంతిమంగా టీసీఎస్ 1.5 శాతం నష్టపోయింది.
ఐటి కంపెనీల షేర్స్ పడిపోవడానికి 3 ప్రధాన కారణాలు
NASDAQ Futures ప్రభావం
అమెరికా స్టాక్ మార్కెట్లలో ఒకటైన నాస్‌డాక్ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై ఉంటుంది. నాస్‌డాక్‌లో ప్రపంచంలోనే పెద్దపెద్ద ఐటి కంపెనీలు అయిన యాపిల్, అమేజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. ఆయా కంపెనీలు నాస్‌డాక్ ఫ్యూచర్స్‌లో లాభాల బాటలో పయణిస్తే భారత ఐటి కంపెనీల స్టాక్స్ కూడా లాభపడతాయి.
ఒకవేళ అమెరికాలోని ఐటి కంపెనీలు నష్టపోతే, వాటి ప్రభావం ఇండియన్ ఐటి కంపెనీలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే, ఇండియన్ ఐటి కంపెనీలకు అత్యధిక మొత్తంలో ఆర్డర్స్, ఆదాయం వచ్చేది అక్కడి కంపెనీల నుండే. ప్రస్తుతం అమెరికాలోనూ ఐటి కంపెనీల షేర్స్ నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తోంది.
అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయం
అమెరికాలో డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్ధిక మాంద్యం రానుందా అనే భయాందోళన వ్యక్తమవుతోంది. టారిఫ్స్ పెంపు కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండియన్ ఐటి కంపెనీలకు అమెరికా మార్కెట్లో మంచి బిజినెస్ ఉంది. అనేక కంపెనీలకు అక్కడి నుండే ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్స్ వస్తుంటాయి. కానీ అమెరికాలో ఆర్ధిక మాంద్యం వస్తే, ఆ ఔట్ సోర్సింగ్ ఆర్డర్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ భయంతోనే చాలామంది ఐటి కంపెనీల షేర్స్ అమ్ముకుంటున్నారు. ఈ సెల్ ఆఫ్ కూడా నిఫ్టీ ఐటి కొలాప్స్ అవడానికి మరో కారణం అవుతోంది.
భయపెడుతున్న త్రైమాసిక ఫలితాలు
ఐటి కంపెనీల గత త్రైమాసిక ఫలితాలను విశ్లేషిస్తే, రాబోయే రోజుల్లో ఐటి కంపెనీల ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఇన్ఫోసిస్ కంపెనీ లాభాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం 1-3 శాతం మాత్రమే వృద్ధి కనిపించే అవకాశాలు ఉన్నాయని ఇలారా సెక్యురిటీస్ అంచనా వేస్తోంది.
ప్రముఖ బ్రోకరేజ్ ఫమ్ కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజా పరిస్థితిపై అధ్యయనం చేసి ఫలితాలను విశ్లేషించింది. ఒకవేళ అమెరికాలో నిజంగానే రిసెషన్ వచ్చినట్లయితే, రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటి కంపెనీలు 18-35 శాతం మేర నష్టపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ అంచనా చెబుతోంది.
ఈ భయాందోళనలకు తోడు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం కారణంగా ఆర్డర్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే అప్పుడు మరింత నష్టపోతాం అనే భయంతో ఇన్వెస్టర్స్ ఇప్పుడే స్టాక్స్ అమ్ముకుంటుండటం ఈ పతనానికి మరో ప్రధాన కారణం అవుతోంది.
భవిష్యత్‌లో మరిన్ని లేఆఫ్స్ తప్పవా?
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఐటి కంపెనీలు నష్టాల బాటలోకి వెళ్తే, పెద్దపెద్ద కంపెనీలు ఆ నష్టాన్ని తాత్కాలికంగా తట్టుకోగలిగినా, చిన్న మధ్యతరహా కంపెనీలు మాత్రం ఔట్ సోర్సింగ్ ఆర్డర్స్ లేక ఇబ్బందులు పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అదే కానీ జరిగితే, ఆయా కంపెనీల వర్క్‌ఫోర్స్‌పై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అది ఐటి ప్రొఫెషనల్స్ లేఆఫ్స్‌కు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పటికే ఈ ఒక్క ఏడాదిలోనే 1,20,000 మందిని కంపెనీలు ఉద్యోగాల నుండి తొలగించాయి. అందులో ఐటి కంపెనీల వాటానే ఎక్కువగా ఉంది. ఒకవేళ ఆర్థిక మాంద్యం అంటూ వస్తే లేఆఫ్స్ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం లేకపోలేదని అంచనాలు చెబుతున్నాయి. గతంలో ఆర్ధిక మాంద్యం వచ్చినప్పుడు ఐటి ప్రొఫెషనల్స్ ఎదుర్కున్న ఇబ్బందులే అందుకు మూగసాక్ష్యాలు.