GST: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలు..?
* 17న జీఎస్టీ మండలి సమావేశం * జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించే ఛాన్స్
GST: అధిక పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ వారంలో జీఎస్టీపై మంత్రుల కమిటీ సమావేశంకానుంది. ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను రేటు నిర్ణయించనున్నారు. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై శుక్రవారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వినియోగదార్లకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దాదాపు 20 నెలల తర్వాత జీఎస్‌టీ మండలి సమావేశం ప్రత్యక్ష పద్ధతిలో లఖ్‌నవూలో జరగబోతోంది.
కేంద్ర సుంకంతో సహా వ్యాట్ రూపంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం రిటైల్ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్‌డ్ సర్‌ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.కేంద్రం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై 32.80 పైసలు, డీజిల్‌పై 31.80 పైసల సుంకం విధిస్తోంది. ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకే వెళుతోంది. జీఎస్‌టీ పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుంది.