PAN 2.0: పాన్ 2.0 వస్తోంది.. కొత్త కార్డు తీసుకోవాలా?, కరెక్షన్లకు అవకాశం ఉందా?.. డీటెయిల్స్ ఇవే!
PAN 2.0 Project Details: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN Card) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ (PAN) అనేది ఆదాయ పన్ను శాఖ (ఐటీ) జారీ చేసే పది అంకెల ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య.
PAN 2.0 Project Details: పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN Card) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ (PAN) అనేది ఆదాయ పన్ను శాఖ (ఐటీ) జారీ చేసే పది అంకెల ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య. పన్ను చెల్లింపులు, టీడీఎస్/ టీసీఎస్ క్రెడిట్లు, ఆదాయ రిటర్నులు, నిర్దిష్ట లావాదేవీలు మొదలైన వాటితో సహా అన్ని సంబంధిత లావాదేవీలను అనుసంధానించడానికి ఐటీ శాఖకు ఈ పాన్ సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి పాన్ కార్డ్ ఉంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో పాన్ కార్డును ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. రూ.1435 కోట్లను వెచ్చించడానికి సిద్దమైంది.
పన్ను చెల్లింపుదారలకు మెరుగైన సేవలు, సాంకేతికంగా మార్పులు తీసుకురావడమే పాన్ 2.0 ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. కొత్త పాన్ కార్డులు క్యూఆర్ కోడ్‌తో రానున్నాయి. దీని ద్వారా అవసరమైన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. పాన్ 2.0 వస్తున్న వేళ.. పాన్ కార్డు దారుల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. కొత్త పాన్ కార్డు తీసుకోవాలా?, డబ్బులు ఖర్చు అవుతాయా?, కరెక్షన్లకు అవకాశం ఉందా? వంటి ప్రశ్నలు కార్డు దారుల్లో ఉన్నాయి. వీటన్నింటికి ఆదాయపు పన్ను శాఖ తాజాగా సమాధానాలు ఇచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
దేశంలో 98 శాతం ఇండివిడ్యువల్స్ (80 కోట్ల మంది)కి ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డులు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే పాన్ కార్డు ఉన్న వారు.. పాన్ 2.0 ప్రాజెక్ట్ వచ్చినా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చిన తర్వాత పాత కార్డులే కొనసాగుతాయి. పాత పాన్ నంబర్లే చెల్లుబాటు అవుతాయి. వినియోగదారులు కొత్త నంబర్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే.. సిస్టమ్ అప్‌గ్రేడ్ అవుతుంది. పాన్ 2.0కి ప్రజలు ఉచితంగా మారవచ్చు. ఇందుకోసమే ప్రభుత్వం రూ.1,435 కోట్లు కేటాయించింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ఆరంభం అవుతుందో కచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించలేదు.
మీ పాన్ కార్డులో ఏవైనా సవరణలు ఉన్నా చేసుకోవచ్చు. అడ్రస్, పుట్టిన తేదీ, పేరు, ఇ-మెయిల్, మొబైల్ నంబర్‌లో సవరణలు చేసుకోవచ్చు. ఉచితంగానే ఇవన్నీ చేసుకోవచ్చు. 2017-18 నుంచి జారీ చేస్తున్న కార్డుల మీద ఉండే క్యూఆర్ కోడ్‌నే.. 2.0లోనూ కొనసాగిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. పాన్ డేటా బేస్‌లో ఉన్న మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్‌లేని పాన్ కార్డుదారులు.. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.