Top 6 News Of The Day: సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ: మరో 5 ముఖ్యాంశాలు
1. అవమానించారు: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
మహిళను అని చూడకుండా సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెట్టడంపై మంత్రి కొండా సురేఖ సోమవారం కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్యలను కేటీఆర్ సమర్ధిస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఇంకోసారి ఇలా జరిగితే కేటీఆర్ ను బట్టలు లేకుండా పరిగెత్తిస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
2. రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచాలి: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం
తిరుపతి లడ్డూ కల్తీపై వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేందుకు ఆధారాలు ఏంటని కోర్టు ప్రశ్నించింది. రెండో అభిప్రాయం తీసుకోకుండానే సీఎం ఈ విషయమై మాట్లాడారని కోర్టు తెలిపింది. తిరుపతి లడ్డూ అంశం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
3. చార్మినార్ ను కూల్చేస్తారా? హైడ్రా పై హైకోర్టు సీరియస్
హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. చార్మినార్ , హైకోర్టును కూల్చాలని అధికారులు అడిగితే అవసరమైన పరికరాలు ఇస్తారా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ప్రశ్నించంది. అమీన్ పూర్ లో కూల్చివేత అంశంపై హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. అమీన్ పూర్ తహసీల్దార్ , హైడ్రా కమిషనర్ రంగనాథ్ లు వర్చువల్ గా సమావేశానికి హాజరయ్యారు. సెలవు రోజుల్లో ముఖ్యంగా శని, ఆదివారాల్లో నే ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వ శాఖల మధ్యే సమన్వయం లేకుండా పోయిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులను చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపితే అప్పుడు తెలుస్తుందని కోర్టు తెలిపింది.
4. అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
అమెరికా వెళ్లే వారికి గుడ్ న్యూస్. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్లను అందుబాటులో ఉంచుతున్నామని అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోమవారం సోషల్ మీడియాలో ఈ ప్రకటన చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్ మెంట్లను చేపట్టినట్టు యుఎస్ ఎంబసీ ప్రకటించింది.
5. లడ్డూ వివాదంపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లను హిందువులే నిర్వహించాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్దిస్తున్నాని జనసేన జాతీయ కార్యదర్శి నాగబాబు చెప్పారు. హిందూ ధర్మం ప్రమాదంలో పడిందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ వంటిదని ఆయన చెప్పారు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని ఈ విషయంలో దోషులెవరైనా బయటకు వస్తారన్నారు.
6. పేద విద్యార్ధికి సీటు ఇవ్వాలి: ఐఐటీ ధన్ బాద్ కు సుప్రీం ఆదేశం
గడువులోపుగా రూ. 17,500 ఫీజు చెల్లించలేదని ఐఐటీ ధన్ బాద్ లో దళిత విద్యార్థి సీటు కోల్పోయారు. ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లా టిటోరా కు చెందిన అతుల్ కుమార్ ఐఐటీ ధన్ బాద్ లో సీటు సాధించారు. అయితే ఈ ఏడాది జూన్ 24 లోపుగా రూ. 17,500 ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే అతని పేరేంట్స్ దినసరి కూలీలు. దీంతో గ్రామస్తులు చందాలు పోగేసి ఫీజును సమకూర్చారు. ఫీజు చెల్లించాల్సిన చివరి రోజున టెక్నికల్ సమస్యలతో అతను ఫీజు చెల్లించలేదు. ఈ విషయమై ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు సూచన మేరకు ఆయన సుప్రీంను ఆశ్రయించారు. వాదనలు విన్న తర్వాత బాధితుడికి ఆడ్మిషన్ ఇవ్వాలని ధన్ బాద్ ఐఐటీని ఆదేశించింది.