Top 6 News Of The Day: డిక్లరేషన్ వివాదంతో జగన్ తిరుమల టూర్ రద్దు:మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-09-27 13:03 GMT

Top 6 News Of The Day

1. వైఎస్ జగన్ తిరుమల టూర్ రద్దు

వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఆయన తిరుమల చేరుకొని శనివారం నాడు ఉదయం పదిన్నర గంటలకు శ్రీవారిని దర్శించుకోవాలి. అయితే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆయన విమర్శించారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన చెప్పారు. తన మతం, కులం అడుగుతున్నారని... తన మతం మానవత్వమని డిక్లరేషన్ లో రాసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను కోరారు. టాపిక్ డైవర్ట్ కావడం ఇష్టంలేకే తాను తిరుమల టూర్ ను రద్దు చేసుకున్నట్టుగా జగన్ వివరించారు.

2. తెలంగాణ మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

తెలంగాణ సమాచార ప్రసారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లగ్జరీ వాచ్ ల కుంభకోణంలో ఈడీ అధికారులు మంత్రి కొడుకు హర్షరెడ్డికి నోటీసులు ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు.

3. వైజాగ్ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేసే యోచనలో కేంద్రం

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను సెయిల్ ను విలీనం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎన్ఎండీసీకి భూమిని విక్రయించడం, బ్యాంకు రుణాల అంశాన్ని పరిశీలిస్తోంది. కేంద్రంలో మూడోసారి ఎన్ డీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే అవకాశమే లేదన్నారు. ఈ విషయమై ప్రధానితో చర్చిస్తానని ఆయన చెప్పారు. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రైవేటీకరణ దిశగానే ఉన్నాయనే కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

4. మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

మూసీ నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మూసీ వెంట నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించనుంది. ఈ ఇళ్ల కేటాయింపునకు 14 మంది హౌసింగ్ సిబ్బందిని నియమిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. కొల్లూరు-1, గాంధీనగర్, జైభవానీ నగర్, నార్సింగి, బండ్లగూడ, డి.పోచంపల్లి, బాచుపల్లి, తిమ్మాయిగూడలో ఇళ్లు కేటాయించనున్నారు.

5. కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై శుక్రవారం ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపనలు వచ్చాయి. రెండు రోజుల క్రితం లోకాయుక్త విచారణకు ఆదేశించింది. దీంతో కేసు నమోదైంది. ఈ కేసులో సిద్దరామయ్య ను ఎ-1 గా చేర్చారు. ఆయనతో పాటు ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితో పాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చారు.

6. అమెరికాలో ఆయుధాలపై కొత్త చట్టం తెచ్చిన బైడెన్ సర్కార్

అమెరికాలో ప్రతి రోజూ ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త చట్టంపై బైడెన్ సంతకం చేశారు. స్కూల్స్, యూనివర్శిటీల్లో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో పిల్లల మరణాలను తుపాకీ హింస ప్రధాన కారణమని ఓ నివేదిక తెలిపింది.

Tags:    

Similar News