Top 6 News Of The Day: తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వారిని శిక్షిస్తామన్న చంద్రబాబు: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-09-21 12:30 GMT

Top 6 News Of The Day

1. తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తెస్తాం: చంద్రబాబు

తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకువస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుకు కారణమైన అధికారులను ఎవరినీ కూడా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. వీరిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. శనివారం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. తిరుమలకు 200 ఏళ్ల చరిత్ర ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. లడ్డూను కల్తీ చేయడమే కాకుండా తనపై జగన్ ఎదురుదాడి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. స్వామివారి ప్రసాదం స్పూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టినట్టుగా ఆయన చెప్పారు.

2. దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణం

దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ శనివారం సాయంత్రం ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. సౌరబ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాష్ గెహ్లాట్, ముఖేష్ అహ్లావట్ లను అతిశీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ నెల 17న దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆప్ శాసనసభ పక్ష సమావేశంలో ఆమెను శాసనసభపక్షనేతగా ఎన్నుకున్నారు. దిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో అతి చిన్న వయస్సు అతిశీదే. గతంలో సుష్మా స్వరాజ్, షీలాదీక్షిత్ లు దిల్లీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అతిశీ దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.

3. జనసేనలోకి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య శనివారం భేటీ అయ్యారు. ఈ ఏడాది జులై 25న ఆయన వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారు. 2019-2024 వరకు ఆయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నెల 26న ఆయన జనసేనలో చేరనున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ నెల 22న సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. అక్టోబర్ 4న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న కిలారు రోశయ్యతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన కొందరు నాయకులు జనసేనలో చేరే అవకాశం ఉంది.

4. అమృత్ పథకంలో రేవంత్ కుటుంబసభ్యుల అవినీతి: కేటీఆర్

అమృత్ పథకంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తన అధికారాన్ని ఉపయోగించి తన బంధువుకు అమృత్ పథకం పనులు అప్పగించారని ఆయన చెప్పారు. రూ.2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1000 కోట్ల విలువైన పనులు అప్పగించారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్లను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టెండర్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా ఆయన చెప్పారు.

5. లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు... హెజ్ బొల్లా టాప్ కమాండర్ మృతి

లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ క్షిపణలు ప్రయోగించింది. దీంతో 31 మంది చనిపోయారు. హెజ్ బొల్లా టాప్ కమాండర్ ఉన్నారని ఆ సంస్థ తెలిపింది.మిలటరీ కార్యకలాపాలను పర్యవేక్షించిన అహ్మద్ మహ్మద్ వాహ్బీ ఈ దాడిలో చనిపోయారని హిజ్ బొల్లా తెలిపింది.హెజ్ బొల్లాలో నెంబర్ 2 గా ఉన్న ఇబ్రహీం అకీల్ ఉన్నారని బెంజిమిన్ నెతన్యాహు ప్రభుత్వం ప్రకటించింది.

6. గ్రీన్ కార్డుదారులకు అమెరికా గుడ్ న్యూస్

అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్ కార్డుదారులకు నిజంగా గుడ్ న్యూస్ ఇది. దీని వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్ కార్డు తీరినప్పటికీ మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పొడిగించారు. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ యుఎస్ సీ ఐఎస్ తెలిపింది. గ్రీన్ కార్డు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నవారికి దీంతో ఊరట లభించినట్టైంది.

Tags:    

Similar News