Top 6 News Of The Day: కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-10-03 13:09 GMT

Top 6 News Of The Day

1. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన అక్కినేని నాగార్జున

సినీ నటులు అక్కినేని నాగార్జున మంత్రి కొండా సురేఖపై నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఆ పిటిషన్ లో చెప్పారు. నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కు తీసుకున్నారు. ఈ విషయమై సమంతకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు.

2. ముడా స్కాంలో సిద్దరామయ్యపై మరో ఫిర్యాదు

ముడా స్కాంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై మరో ఫిర్యాదు అందింది. ముడా స్కాంలో సాక్ష్యాలను తారుమారు చేశారని ప్రదీప్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎం తనయుడు యతీంద్ర పేరు చేర్చారు. సిద్దరామయ్యపై ఇప్పటికే కేసు నమోదైంది. సిద్దరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఆయన బావమరిదిపై కూడా కేసు నమోదైంది.

3. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంలో విచారణ వాయిదా

తిరుపతి లడ్డూ వివాదంపై విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటు మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ విచారించింది కోర్టు.శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీపై విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ ను కొనసాగించాలా.. లేదా స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా.. అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఇవాళ తన అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ రేపు జరగనుంది.

4. ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ ల అనర్హత విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ గురువారం నిరాకరించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని.. నాలుగు వారాల్లో ఈ విషయాన్ని తేల్చకపోతే తామే సుమోటోగా తీసుకొని విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. అయితే ఈ పిటిషన్ పై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేశారు. ఈ తీర్పుపై స్టే కోరారు. కానీ, స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ నెల 20న ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.

5. మూసీని అడ్డం పెట్టుకొని ఎన్నాళ్లు బతుకుతారు?

మూసీని అడ్డంపెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతారని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో చర్చించేందుకు రావాలని ఆ యన కేటీఆర్, హరీష్ రావులను సచివాలయానికి రావాలని కోరారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ, తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ అవసరం లేదా అని ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గురువారం నాడు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ లు కూల్చాలా వద్దా అని ఆయన అడిగారు. సబితా ఇంద్రారెడ్డి పేద అరుపులు మానుకోవాలని ఆయన సూచించారు.

6. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో ఆరుగురు అరెస్ట్

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ కుమార్, చిన్ని, సుబ్బారావు, మాధవరావు, మధుబాబు, రాములను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా మాజీ మంత్రి జోగి రమేశ్ అనుచరులుగా గుర్తించారు. నిందితులను విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారని అప్పట్లో టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగన్ అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరిగి ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Tags:    

Similar News