ఈశాన్య రొమానియాలో ఓ కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రిలోని ఐసీయూలో హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. బుకారెస్ట్ కు 350 కిలోమీటర్ల దూరంలోని పియత్ర నెమ్ట్ లో ఉన్న ఆసుపత్రిలో ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 16 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల ఊపిరాడక పేషెంట్లు మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర అస్వస్థతకు గురైన వారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, అలా ఇబ్బంది పడుతున్న వారిలో ఆరుగురు పేషెంట్లు, డ్యూటీ డాక్టర్ ఉన్నారనీ ఆస్సత్రి వర్గాలు తెలిపాయి.