"సూర్యా ద్భవంతి భూ తాని,
సూర్యేణ పాళీ తానిచ
సూర్యే లయం ప్రాప్నువంతి
య సూర్యః సోహ మేవచ''
చిమ్మ చీకట్లను తొలగించి, సమస్త లోకాలకు వెలుగును పంచేది సూర్య భగవానుడు. ఈ ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని పుట్టిన రోజును సమస్త జగత్తు రథ సస్తమిగా జరుపుకుంటారు. అసలు సూర్యని పుట్టిన రోజును సూర్య జయంతి అని పిలవాలి కానీ, రథ సప్తమి అని ఎందకు పిలుస్తారు? అసులు దీనికి కారణం ఏంటి. సమస్తాన్ని కాచే సూర్య భగవానుని రథానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సూర్యుడు ఒక ప్రాంతంలో అస్తమించినా.. మరో ప్రాంతంలో ఉదయిస్తాడు. అంటే దానికి కారణం సూర్యడు తిరుగుతున్నట్టు కాదు, సూర్యుడు ఒకే చోట నిశ్చలంగా ఉంటాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ సూర్య జయంతిని రథ సప్తమి అని ఎందుకు పిలుస్తారు? అసలు ఈ 'రథ సప్తమి' రోజున పూజ ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?
ఇలాంటి అనేక ప్రశ్నలు మానవ మాత్రులకు మాత్రమే కాదు.. ఈ సందేహాలన్నింటినీ ద్వాపర యుగంలో సాక్షాత్ ఆ ధర్మరాజే శ్రీకృష్ణుడిని అడిగాడట. ఇక ఈ సందేహాలన్నీ విన్న ఆయన స్పందిస్తూ ధర్మరాజుకు పూజా విధానం వివరించాడు. దాంతో పాటుగానే ఆ రోజున ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా మలసుకోవాలో కూడా వివరించారు.
రథసప్తమి స్నానంతో గంగా స్నాన ఫలితం
రథ సప్తమి రోజున తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానజలాలలో శాలిధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటితో స్నానం చేయాలి. సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ప్రీతి. అందువలన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు అన్నీ నశిస్తాయని గర్గమహాముని తెలిపారు. అంతే కాదు ఏడు రకములైన వ్యాధులను కూడా నశింపజేస్తాయి.
ఆ తరువాత అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని చేయాలని పురాణాలు చెపుతున్నాయి. ఇలా చేస్తే పుణ్యఫలాన్ని, అష్ట ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాను పొంది సమస్త ప్రాణకోటి జీవిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.
సూర్యుడి రథం దిశను మార్చుకునే రోజు
సూర్యుని గమనం ఏడు గుర్రములు కలిగి, ఏక చక్రం కలిగిన బంగారు రథం మీద సాగుతుందని వేదము తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధాలు. సకల జగత్తుకి వెలుగునిచ్చే ఈ సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని ఈ రోజున మార్చుకుంటాడని శాస్త్రం తెలుపుతుంది.
ఆషాఢమాసము నుంచి పుష్యమాసం వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయనం దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అందుకు సూచికగా ఈ రోజున రథసప్తమిగా పిలుస్తారు.
వ్రతకథ...
పురాణాల్లో తెలిపిన ప్రకారం రథసప్తమి వ్రత విధానం ఎంతో విషిష్టతను కలిగి ఉంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వ కాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ఒక కుమారుడు ఉండెడి వాడు. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. రుషులు తెలిపిన విధంగానే ఆ రాజు వ్రతం ఆచరించెను, దీంతో రాజునకు తగిన ఫలితము కలిగెను. అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపెను.
చిక్కుడ కాయలతో రథం.. చిక్కుడు ఆకుల్లో నైవేద్యం
రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెపుతారు. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పోయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు. తరువాత ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.
రథ సప్తమికి పాటించవలసిన నియమాలు
ఈ రోజున బంగారముగాని, వెండిగాని, రాగితో కాని రథమును చేయించి, అందులో కుంకుమతో, దీపములతో అలంకరించి అందులో ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమను ప్రతిష్టించాలి. ఆ తరువాత దాన్ని పూజించి పండితులకు ఆ రథాన్నిదానము చేయాలి. ఈ రోజున ఉపవాసమును ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని పురాణాలు తెలిపాయి.
ఇంతిటి శుభప్రదమయిన రోజునే ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు. ఇందులో చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు పుణ్యకార్యములు తలపెట్టిన విజయవంతగా పూర్తి అవుతాయన ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.