హిందు పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయం. సంక్రాంతి వస్తే ముందుగా ముత్యాల ముగ్గులతోనే పండుగ ప్రారంభం అవుతుంది. అందమైన రంగవల్లికలు.. హరివిల్లులను తలపిస్తూ తెలుగు లోగిళ్లలో పండుగ శోభ ను పెంచేస్తాయి. ప్రతి ఇంటి ముంగిట ముచ్చట గొలిపే ముగ్గు వాటి మధ్య లో వుండే గొబ్బెమ్మలు అతిథులను ఆహ్వానిస్తాయి. మహిళలు వారి సృజనాత్మకతకు పని చెప్పి మరీ అందమైన రంగవల్లులను తీర్చి దిద్దుతారు. ఇక ఆడపిల్లలు పట్టు పరికీణీలు వేసుకుని స్నేహితులతో కలసి ముగ్గులను తీర్చిదిద్దడంలో ప్రతిభ కనబరుస్తారు. అందుకే ఈ పండుగ ఆడపిల్లలకు చాలా ప్రత్యేకం.
అసలు మన ప్రతీ పండుగలోను ఆచార సంప్రదాయాల్లోను అనేక ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. సంక్రాంతి పండుగ శీతాకాలంలో వస్తుంది. ఈ సీజన్ లో క్రీమి కీటకాలు ఎక్కువగా వుంటాయి. వాటి నుండి రక్షణ పొందేందుకు ఈ ముగ్గులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటి ముందు పేడ కళ్లాపు వేసి, గుమ్మానికి పసుపు రాసి వరి పిండితో ముగ్గులు వేస్తారు. పేడ, పసుపు యాంటిబయెటిక్ గా పనిచేసి క్రీములను నాశనం చేస్తాయి. ఇక వరిపిండిని ముగ్గు వేయడం వలన క్రీములకు ఆహారంగా పని చేస్తుంది. అవి గుమ్మం దాటి లోపలకు రాకుండా బయట నుండే ఆగిపోతాయి. వాటి వలన వచ్చే రకరకాల వ్యాధులకు దూరంగా వుండాలనే ఈ ముగ్గు సంప్రదాయాలను పెద్దలు మనకు చెప్పడం జరిగింది.
దీంతో పాటు శీతాకాలంలో ఉదయాన్నే లేచి, శ్రమించి ముగ్గులు వేయడం వలన మహిళలకు మంచి వ్యాయామం జరుగుతుంది. దీని వలన మహిళలు రోజంతా ఎంతో ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. ముగ్గు వేస్తూ పాటలు, దేవతా స్త్రోత్రాలు చదవడం వలన మనసు ప్రశాంతంగా వుంటుంది.
అయితే ఇటీవల కాలంలో నగర జీవితానికి అలవాటు పడడంతో ముగ్గులు వేసుకునే అవకాశం మహిళలకు రావడం లేదు. దీంతో కనీసం సంక్రాంతి సంబరాల్లోనైనా నెల రోజుల పాటు ఇలా ముగ్గులు వేసుకోవడం సరదాలను పంచడంతో పాటు ఏడాదికి సరిపోయే ఉత్సాహాన్ని మిగుల్చుతుందని అంతా భావిస్తున్నారు. మరి మన సంప్రదాయాలను మనం పాటిస్తేనే భావి తరాలకు వాటిని అందించగలుగతామని అందరూ గుర్తించాలి.