Ugadi 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025-26.. మేష రాశి వారికి ఈ కష్టాలుతీరినట్లే..!
Ugadi 2025 Aries Horoscope: గోచార స్థితిగతులను బట్టి, మేష రాశివారికి సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యసాధనకు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
Ugadi 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025-26.. మేష రాశి వారికి ఈ కష్టాలుతీరినట్లే..!
ఆదాయం:2
వ్యయం: 14
రాజపూజ్యత: 5
అవమానం : 7
Ugadi 2025 Aries Horoscope: గోచార స్థితిగతులను బట్టి, మేష రాశివారికి సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యసాధనకు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకనెల అనుకూలంగా ఉంటే మరో నెల ప్రతికూలంగా ఉంటుంది. పట్టుదలతో ఒత్తిళ్లను జయించాలి. ఈ రాశివారికి ఏలినాటి శని తొలిదశ మొదలైంది. కాబట్టి, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్తలకు ప్రాధాన్యమివ్వాలి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనూహ్య ఖర్చులున్నప్పటికీ, తగినంత రాబడి ఉంటుంది. అయినా ఖర్చులను నియంత్రించడం ఉత్తం. శత్రుబాధలు ఉంటాయి. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధమైన జీవన శైలి విజయతీరాలకు చేరుస్తుంది.
కుటుంబంలో కొంత అశాంతి ఉంటుంది. అయినా కలవరపడే పని ఉండదు. సంతానం కారణంగా అనుకోని సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు పాటించడం ద్వారా ఇక్కట్ల నుంచి బయటపడే వీలుంది. ఇంటా బయటా కూడా సంయమనం, స్నేహ భావాలతో ఉండాలి. ఏ వ్యవహారాన్నయినా వాయిదా వేయడం మంచిది కాదు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. అనుకోని అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ కూడదు. గ్రహాల అనుకూలత గతుల వల్ల, వివాహాది శుభ కార్యాలు కలిసివస్తాయి. నూతన వస్తు, వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి కొనుగోలు, గృహ నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. దేవ, ధర్మ కార్యాలను ఆచరిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.
వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఆశించిన విధంగానే స్థానచలనాలు, పదోన్నతులు ఉంటాయి. ఉద్యోగపరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. చట్ట వ్యతిరేక పనుల కారణంగా చిక్కుల్లో పడే సూచన ఉంది. జాగ్రత్త. ప్రైవేటు రంగంలోని వారికి ఆశించిన ఫలితాలు, ఉన్నతాధికారుల మన్ననలు, ఉత్సాహాన్నిస్తాయి. వృత్తిని విడిచిపెట్టే ఆలోచన చేస్తారు. ఒత్తిళ్లు తాత్కాలికమే అని గుర్తించండి. క్రమేణా ఉద్యోగ వృద్ధి, స్థిరత్వం ఏర్పడతాయి. నిరుద్యోగులు, అధిక శ్రమతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం ఉంటుంది. కెరేర్ పరంగా మీకు కోపం వచ్చినా, అధికారులకు కోపం వచ్చినా మీరే తగ్గి అణకువగా ఉండడం ద్వారా సత్ప్రయోజనాలను పొందుతారు.
వ్యాపార రంగంలోని వారి ఆర్థిక లావాదేవీలు, క్రయ విక్రయాలు ఆశించిన విధంగానే ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. అధికంగా అప్పులు ఇవ్వడం, తెచ్చుకోవడం మంచిది కాదు. రావాల్సిన ధనం సమయానికి అందడం కష్టం. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్‌లపై ఆధారపడ్డ వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీగా నష్టపోయే సూచన ఉంది.
రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆశించిన పదవిని పొందడంలో ఆలస్యం జరుగుతుంది. నిరాశ చెందకుండా, ప్రజాజీవితంలో చురుగ్గా ఉంటూ, పైవారి మెప్పును పొందే ప్రయత్నం చేయాలి.
విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు బాగా శ్రమించాల్సిన కాలమిది. ర్యాంకుల కోసం వెంపర్లాడక, మెరుగైన పర్సెంటేజీని సాధించేందుకు కష్టపడాలి. విదేశీ విద్యా ప్రయత్నాల్లో నిరాశ తప్పేలా లేదు.
మేషరాశివారు, తరచూ శివాలయాన్ని సందర్శించడం మంచిది. ఏలినాటి శని కారణంగా, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకుంటే శుభ ఫలితాలుంటాయి. విష్ణు సహస్ర నామ పారాయణ కూడా మేలు చేస్తుంది.