Virgo Horoscope 2024: కన్యారాశివారికి సామాన్య ఫలితాలు.. ఈ విషయాలలో జాగ్రత్త..!
ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
Virgo Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవణం చేయాలి. ఈ సంవత్సరం జాతకంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, కర్నము, వారం ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశివారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
ఆదాయం : 5
వ్యయం : 5
రాజపూజ్యం : 5
అవమానం : 2
అదృష్ట సంఖ్య 6
ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1, 2 పాదములు. మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో
క్రోధి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. రైతులకు కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారికి సాఫీగా పనులు జరుగుతాయి. లాయర్లు, డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టర్లు టెండరు జాగ్రత్తగా పరిశీలించాలి. రాజకీయ నాయకులు తక్కువగా మాట్లాడాలి. వెండి, బంగారం, టింబరు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. సిమెంట్, ఐరన్, బిగ్ ఇండస్ట్రీ వాళ్లకి అనుకూలంగా ఉంటుంది.
స్మాల్ ఇండస్ట్రీ వారికి సామాన్యంగా ఉంటుంది. డబ్బు విషయంలో అనవసరమైన మాటలు పడుతారు. ఏదైనా మీరు ఎంతవరకు మాట్లాడాలి అనే విషయంపై జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ధనాదాయం ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే ఎంత వచ్చినా.. వచ్చింది వచ్చినట్లు ఖర్చు అవుతుంది. భూములు, గృహనిర్మాణం వస్తువాహనములు సమకూర్చుకొనుటకు అవకాశాలు ఉన్నాయి. నిగ్రహశక్తి కలిగిన వారు సంఘంలో ఉన్నత పదవులు ఆశిస్తారు.
గొప్పగా ఎప్పుడు భావించకూడదు. అంతా దేవుడి దయ అనుకోవాలి. ఉత్తర నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించాలి. ఆదిత్య పారాయణ చేయాలి. అరసవెల్లిలో పూజలు, గోధుమలు దానం చేయాలి. హస్త నక్షత్రం వాళ్లు ముత్యం ధరించాలి. దుర్గాదేవికి పూజలు చేయాలి. శుక్రవారం సాయంత్రం కుంకుమ, పూజ చీర జాకెట్ ముక్కలు, గాజులు దండ, నిమ్మకాయల దండ, కొబ్బరికాయలు 5, పానకం, వడపప్పు, స్వీట్ సమర్పించి అమ్మవారి అలంకరణలో ప్రత్యేక పూజలు చేయించాలి. చిత్త నక్షత్రం వాళ్లు పగడం ధరించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేయాలి. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాహుకేతువులకు పూజలు, నవగ్రహ ప్రదక్షిణలు, దానాలు తల్లిదండ్రులకి పాదాభివందనములు చేయాలి.