ఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా అన్నంత పని చేసి చూపించింది. మండలి రద్దుతో వైసీపీకి కూడా నష్టం అని చెప్పినా వినకుండా తమకు జరిగే నష్టాన్ని లెక్క చెయ్యకుండా మండలి రద్దు తీర్మానం చేసింది.
ఏపీ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి రద్దుపై సీఎం జగన్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు దానిపై చర్చించారు. చర్చలో పాల్గొన్న సభ్యులంతా మండలి రద్దుకే మొగ్గు చూపారు. చివరిగా సీఎం జగన్ చర్చలో పాల్గొని మండలి రద్దు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే కారణాలను వివరించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఈ తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.
తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరారు. దీంతో సభ్యులంతా లేచి నిలబడగా శాసనసభ సిబ్బంది లెక్కించి అనుకూలంగా 133 మంది ఉన్నట్లు తేల్చారు. తటస్థంగా, వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
అయితే, శాసన మండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగానే తాము నడుచుకుంటున్నట్లు తెలిపారు. తమ పార్టీకి మండలిలో ఎక్కువ మందికి అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నా ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ పేర్కొన్నారు.
మండలి రద్దుకు శాసనసభ తీర్మానం చేయడం విచారకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. మూడు రాజధానుల బిల్లును మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారనే ఆక్రోశంతో శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి పంపడం దురదృష్టకరమన్నారు.
మరోవైపు శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మండలిని రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. అయితే, శాసనసభలో ఆమోదం పొందిన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి పంపనున్నారు. మరి కేంద్రం ఈ తీర్మానాన్ని ఆమోదిస్తుందా..? లేదా? అన్నది చూడాలి.