Yaas Cyclone: ముంచుకొస్తున్న పెను తుపాన్
Yaas Cyclone: తౌక్టై తుపాను సృష్టించిన కల్లోలం మరువకముందే మరో తుపాను గండం ముంచుకొస్తుంది.
Yaas Cyclone: తౌక్టై తుపాను సృష్టించిన కల్లోలం మరువకముందే మరో తుపాను గండం ముంచుకొస్తుంది. ఈరోజు(శనివారం) ఉదయమే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం మరో మూడు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర సర్వీసులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. అన్ని రకాల ఔషధాలు, ఆరోగ్య సర్వీసులను సిద్ధం చేయాలంది.
ఈ నెల 26 నాటికి అది పెనుతుపానుగా రూపు దాల్చుతుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుకుంటుందని వివరించింది. బెంగాల్, ఒడిశా, ఏపీకి నడిపే 22 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బలగాలను మోహరించింది. ముంపు, తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశాలోని 14 జిల్లాల్లో అప్రమత్తతను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవ్వాలని నౌకాదళం, తీర రక్షక దళాలను ఒడిశా ప్రభుత్వం కోరింది.