జనసేనకు జేడీ ఎందుకు గుడ్ బై చెప్పారు.. జనసేన విశాఖ తీరంలో జరిగిన ఆ అలజడి ఏంటి?
జనసేనలో మరో ఆరడుగుల బుల్లెట్, బయటికి దూసుకొచ్చేసింది. తుపాకీలోనే వుండి, సతమతం కాలేనంటూ, బలవంతంగా బయటికొచ్చేసింది. యూత్‌లో పాపులర్ లీడర్, జేడీ లక్ష్మీనారాయణ, జనసేనకు రాజీనామా చేయడం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ కార్పొరేషన్‌ను గెలిచి పవన్‌కు గిఫ్టు ఇస్తానన్న జేడీ, అంతలోనే జనసేనకు ఎందుకు బైబై చెప్పారు? పవన్ సినిమాలు చేయడే కారణమా లేదంటే అంకుమించిన కారణం ఇంకేమైనా వుందా?
జాతీయ పార్టీ బీజేపీతో దోస్తీ కట్టిన తరువాత, గత ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి బయటపడుతున్న జనసేనకు పార్టీలో కీలక నేతలు షాక్ ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తరవాత దాదాపు చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పార్టీ జోష్‌లోకి వెళ్తుందనుకునేలోపే, మిగిలిన నేతలు పార్టీకి ఝలక్ ఇస్తున్నారు.
పవన్ సినిమాల్లోకి వెళ్లడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు జేడీ. అయితే జేడీ రాజీనామా ఆమోదిస్తూనే సినిమాలు చేయడానికి కారణాలు తెలిపారు పవన్. అయితే పార్టీకి ఇప్పటికే చాలా మంది నేతలు దూరమయ్యారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంది. అసలు జేడీ లక్ష్మీనారాయణ, రాజీనామా ఎందుకు చేశారన్న చాలా అంశాలు ప్రచారంలో వున్నాయి.
జనసేనకు జేడీ రాజీనామా చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన నాటి నుంచి, ఊహాగానాలొచ్చాయి. సేనలో జేడీకి, పవన్‌కు అసలు పొసగడం లేదని, ఈగోవార్ సాగుతోందన్న మాటలు వినపడ్డాయి. జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్ ఇవ్వాలని కూడా పిలుపునిచ్చారు జేడీ. అయితే, ఇంతలోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే, పవన్ మళ్లీ సినిమాలు చేయడమే కారణమని జేడీ చెబుతున్నప్పటికీ, అంతకుమించిన కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది.
తనను మొదటి నుంచి పార్టీలో కీలకమైన నేతగా పరిగణించడంలేదని రగిలిపోయారట జేడీ. సీబీఐ మాజీ అధికారిగా, సేవా కార్యక్రమాల ద్వారా, తనకు సైతం చాలా పాపులారిటీ వుందని, కానీ పార్టీలో తన పాపులారిటీని ఏమాత్రం తట్టుకోలేనివారు, పవన్‌కు తనపై రకరకాలుగా చెబుతున్నారని బాధపడ్డారట జేడీ. పార్టీ కీలకమైన కార్యక్రమాలు, విధానాల రూపకల్పనలో తనకు ఏమాత్రం భాగస్వామ్యం కల్పించడం లేదని ఆగ్రహంగా వున్నారట. బీజేపీతో పొత్తు విషయంలో తనను ఏమాత్రం పట్టించుకోలేదని, ఢిల్లీకి వెళ్లిన నేతల బృందంలోనూ తనకేమాత్రం చోటు కల్పించలేదని ఫైరయ్యారట జేడీ. ఇలా కూరలో కరివేపాకులా తనను తీసి పక్కనపెడుతున్నారని, తన అభిమానుల దగ్గర చాలాసార్లు బాధపడ్డారట లక్ష్మీనారాయణ.
పార్టీలో నాదెండ్ల మనోహర్ పెత్తనం పెరిగిపోయిందని చాలాసార్లు తన అభిమానుల దగ్గర రగిలిపోయారట జేడీ. పవన్ సైతం కేవలం ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నారని ఫీలయ్యారట. నాదెండ్ల మనోహర్, పవన్ దగ్గరకు ఎవర్నీ పోనివ్వడంలేదని, నేరుగా మాట్లాడనివ్వడంలేదన్నది లక్ష్మీనారాయణ కంప్లైంట్. పవన్‌ను కలిసేందుకు చాలాసార్లు నాదెండ్ల అడ్డుపడ్డారని వ్యాఖ్యానించారట. జనసేనకు జేడీ రాజీనామా చేయడం వెనక, పార్టీలో తనకు ప్రాధాన్యతలేకపోవడం, నాదెండ్ల పెత్తనం పెరిగిపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇవేకాదు, మరో కీలకమైన విషయంలోనూ జేడీ అభద్రతాభావానికి లోనైనట్టు ప్రచారం జరుగుతోంది.
బీజేపీతో జనసేన పొత్తుపై జేడీకి ఇష్టముందా లేదా అన్న విషయం పక్కనపెడితే, కమలంతో ప్రయాణంతో ఆయనలో ఒక అభద్రతాభావం కలిగిందన్న మాటలు వినపడ్తున్నాయి. బీజేపీ తరపున విశాఖ ఎంపీ స్థానంపై ఇప్పటికే చాలామంది ఆశలుపెట్టుకున్నవారున్నారు. గతంలో కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో పురంధ్రీశ్వరి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ-జనసేన పొత్తు నేపథ్యంలో, వచ్చే ఎన్నికల నాటికి తనకు జనసేన నుంచి టికెట్ ఇవ్వడం అసాధ్యమని జేడీ ఫీలవుతున్నారట. ఇప్పటికే విశాఖలో క్యాడర్‌ను పెంచుకున్నారు. విశాఖ ఎంపీ టికెట్ తనకివ్వరన్న గ్యారంటీలేనప్పుడు, ఈ నాలుగేళ్లూ పార్టీలోనే వుండి ఏంలాభమని జేడీ భావిస్తున్నారట. అందుకే పార్టీ నుంచి బయటకు రావడమే మేలని, రాజీనామా చేశారన్న ప్రచారం జరుగుతోంది. పవన్‌లో నిలకడలేదు, సినిమాల్లోకి వెళ్లనని చెప్పి, మళ్లీ సినిమాల్లోకి వెళుతున్నందుకే రాజీనామా చేస్తున్నట్టు జేడీ ప్రకటించినా, అసలు కారణాలు మాత్రం, తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఎంపీ సీటుపై అభద్రతాభావమేనని జనసేనలో చర్చ జరుగుతోంది.