జనసేన-బీజేపీల కలయిక వెనక ఒక మాజీ ముఖ్యమంత్రి చక్రం తిప్పారా? కొంతకాలం క్రితమే కాషాయతీర్థం పుచ్చుకున్న ఆ మాజీ సీఎం, కమలంతో కల్యాణ్ ప్రణయానికి ముహూర్తం ఫిక్స్ చేశారా? తన కొడుకు ద్వారా జనసేనాని మనసును కాషాయంవైపు తిప్పారా? జరిగిన, జరుగుతున్న పరిణామాలు, ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఇంతకీ ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? ఆయన నడిపిన రాయబారమేంటి?
బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, పాచిపోయిన లడ్డూలంటూ వెటకారాలు చేసి, తిరిగి అదే బీజేపీకి దగ్గరయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కమలంతో ఎప్పుడెప్పుడు వియ్యం పొందుదామా అన్నట్టుగా ఉవ్విళ్లూరారు పవన్. అయితే, కమలం పట్ల పవన్‌లో ఇంత ప్రేమ పొంగడానికి, కర్త కర్మ వేరే వున్నారన్న చర్చ వినిపిస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి పవన్‌ను బీజేపీ వైపు ఆకర్షించేలా చేశారని తెలుస్తోంది. ఇంతకీ ఆ మాజీ సీఎం ఎవరో చెప్పలేదు కదా నాదెండ్ల భాస్కర్ రావు. ఫాదర్ ఆఫ్ నాదెండ్ల మనోహర్.
జనసేన, భారతీయ జనసేనగా మారడం వెనక మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కీలక పాత్ర పోషించారన్న మాటలు జోరుగా వినపడ్తున్నాయి. జనసేనలోనే వున్న కుమారుడు నాదెండ్ల మనోహర్ ద్వారా చక్రంతిప్పారని కొందరు మాట్లాడుకుంటున్నారు. 2019 జులైలో భారతీయ జనతా పార్టీలో చేరారు నాదెండ్ల భాస్కర్ రావు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాల వెల్లడి అనంతరం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆల్రెడీ రాజకీయాలు వదిలేసి, రామాహరీ అంటూ కాలం వెళ్లదీస్తున్న భాస్కరరావు, ఇప్పుడెందుకు బీజేపీలో చేరుతున్నారు, ఈ లేటు వయస్సులో పార్టీ మారి ఈయన సాధించేది ఏది అంటూ చాలామంది నోరెళ్లబెట్టారు. కానీ ఆయన పార్టీ మారింది తనకోసం కాదని, మరెవరి కోసమే ముందేవెళ్లి బాటలేసే పనిలో వుంటారని విశ్లేషకులు అనుమానించారు. సీన్ కట్ చేస్తే, ఇప్పుడు అదే జరుగింది.
నాదెండ్ల భాస్కర్ రావు, బీజేపీలో చేరింది తన కుమారుడు మనోహర్ కోసమేనని, అప్పుడే జోరుగా చర్చలు జరిగాయి. ఏపీలో అటు కాంగ్రెస్ అంతర్థానం కావడం, ఇటు టీడీపీలో వెళ్లడానికి ఆస్కారమేలేకపోవడం, అటు వైసీపీలోనూ ఛాన్స్‌లేకపోవడంతో, మనోహర్‌కు జనసేన తప్ప మరో మార్గం కనిపించలేదట. కానీ జనసేనా గెలవలేదు, మనోహర్ కూడా గెలవలేదు. దీంతో తన కుమారుడి భవిష్యత్తు పట్ల దిగాలుపడ్డ భాస్కర్ రావు, బీజేపీనే ఇక ప్రత్యామ్నాయ పార్టీగా కనిపిస్తోందని భావించి, తన కుమారుడి కోసమే బీజేపీలో చేరారన్న వాదన వినిపించింది. అమిత్ షా సమక్షంలో గ్రాండ్‌గా బీజేపీలో చేరిన భాస్కర్ రావు, ఆ తర్వాత మనోహర్‌ను సైతం రావాలంటూ ఒత్తిడి చేశారట. కానీ పవన్‌ను ఒంటరిగా వదిలిరావడం ఇష్టంలేదని చెప్పారట మనోహర్.
దీంతో పవన్ కల్యాణ్‌ను బీజేపీలోకి లాగడానికి భాస్కర్ రావు సైతం చాలా ప్రయత్నాలు చేశారట. కానీ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపడంతో జనంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైందని, తనపైనా అలాంటి అనుమానాలే వున్నాయని భావించిన పవన్, ఆ పని మాత్రం చెయ్యనని చెప్పారట. దీంతో పవనూ రావడం లేదు, మనోహర్‌నూ రానివ్వడంలేదని తపించిన భాస్కర్ రావు, విలీనం కాకపోయినా, రెండు పార్టీలు కలిసి పని చేసేలా, పవన్‌కు నచ్చజెప్పాలని కుమారుడి ద్వారా రాయబారం నడిపారన్న మాటలు వినిపించాయి. ఎలాగూ ఒంటరిగా జగన్‌పై పోరాటం చేయడానికి బలం సరిపోవడం లేదని భావిస్తున్న పవన్, ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారని తెలుస్తోంది. బీజేపీతో కలిసి నడవడానికి అంగీకారం తెలిపారట. అటు బీజేపీకి కూడా రాష్ట్రంలో ఒక పాపులర్ ఫేస్ కావాలి కాబట్టి, పొత్తుకు ఒప్పుకుందట. ఆ విధంగా నాదెండ్ల భాస్కర్ రావు, ప్రయత్నాలు కొంతరకైనా ఫలించాయన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ-జనసేన ఉమ్మడి ప్రయాణానికి ఆరు నెలల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించిన భాస్కర్ రావు, దానికి అనుగుణంగా పవన్ నోటి నుంచి కాషాయ భాష పలికించారన్న మాటలు వినపడ్తున్నాయి. పవన్‌లోనూ కాషాయ భావజాలం ఉప్పొంగాలని, ఇద్దరి భావాలు ఒక్కటే అనిపించుకోవాలని, తన కుమారుడి ద్వారా పవన్‌కు ఉద్భోదించారట. దీంతో కొన్ని నెలల నుంచి పవన్ భాష, సిద్దాంతం మొత్తం మారిపోయింది. హిందూ ధర్మం, మతమార్పిళ్లు, జగన్ క్రిస్టియానిటీపై అదేపనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు నుంచి కాషాయీకరణ కావడానికి, నాదెండ్ల భాస్కర్ రావు వయా నాదెండ్ల మనోహర్ సలహాలు, సూచనలే కారణమన్న మాటలు జోరుగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ మాటలకు కార్యరూపమే బీజేపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మొత్తానికి పాలిటిక్స్‌కు రిటైర్ చెప్పారని అందరూ అనుకుంటున్న తరుణంలో, నాదెండ్ల భాస్కర్ రావు, రాజకీయాలు బాగానే నడిపించారన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, కేవలం కలిసి ప్రయాణించడమేనా, కొంతకాలం ప్రయాణం తర్వాత, జనసేన బీజేపీలో విలీనమవుతుందా అన్న అనుమానాలు మాత్రం సశేషం. ఇందుకూ నాదెండ్ల భాస్కర్ రావే, బాటలేస్తారా, అన్న డౌట్స్ కూడా సశేషమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.