విజయనగరం జిల్లాలో రాజుగారికి కొత్త తలనొప్పేంటి?

Update: 2020-01-04 06:59 GMT

ఆ నేత అనారోగ్యం నుంచి కోలుకుని జిల్లాకు రావడంతో, అంతా ఆయనపై కోటి ఆశలు పెట్టుకున్నారట. జిల్లాలో ఆ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని ఆశించారట. తీరా ఆయన రావడమేమోగానీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో, శ్రేణుల్లో మళ్లీ నిరాశ ఆవహించిందట. కానీ సీన్ కట్‌ చేస్తే ఆయన రాకపోవడం వెనక మరో కారణం వుందని తెలిసి, క్యాడర్‌లో కొంతమంది రివర్స్‌ అయ్యారట.

2019 ఎన్నికలు విజయనగరం జిల్లా టిడిపిని కోలుకోలేని దెబ్బతీశాయి. జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో ఘోర పరాజయం చవి చూడటంతో పార్టీలోని ముఖ్య నేతలంతా ముఖం చెల్లక కొన్ని నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. అదే తరుణంలో జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతి రాజు సైతం అనారోగ్యానికి గురి కావడంతో, జిల్లా టీడీపీని నడిపించే నాయకుడు లేక పార్టీ పరిస్థితి ఆరు నెలలుగా అగమ్యగోచరంగా తయారయ్యింది.

ఓ పక్క స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పార్టీని బలోపేతం చేసేదెవరని కార్యకర్తలు నిరాశ చెందుతున్న తరుణంలో, అశోక గజపతి రాజు కుమార్తె అతిధి గజపతి తండ్రి లేని లోటు భర్తీ చెయ్యాలని ప్రయత్నించినప్పటికీ, రాజకీయంగా అనుభవం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అంతగా ఉత్సాహం తేలేకపోయారు. దీంతో పార్టీనీ గట్టెక్కించేదెవరంటూ, క్యాడర్ నిరాశ చెందుతున్న తరుణంలో, జిల్లాకు పెద్ద దిక్కైన అశోక గజపతిరాజు అనారోగ్యం నుంచి కోలుకుని జిల్లాకు వస్తున్నారన్న సమాచారం, టిడిపి శ్రేణుల్లో అంతులేని ఆనందాన్ని కలిగించిందట. సుమారు ఐదు నెలలు తరువాత జిల్లాకు వచ్చిన అశోక్ గజపతిరాజుకు, పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని అన్ని దేవాలయాల్లో ప్రకత్యేక పూజలు చేశారు.

ఇంతవరకు జిల్లాకు పెద్ద దిక్కులేక తెలుగుదేశం నాయకులు డీలాపడగా ఆయన రాకతో ఊపిరి పీల్చుకున్నారట. ఇక జిల్లా బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిస్తారని అంతా ఆశించారట. కానీ ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిలవలేదట. రాజుగారు రావడమేగాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పార్టీ శ్రేణులను మళ్లీ నిరాశలోకి నెడుతోందట.

జిల్లాలో పార్టీ ఘోర పరాజయంతో పాటు అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అతిథి గజపతి కూడా ఓటమి పాలవ్వడంతో రాజుగారు కాస్తా మనస్తాపానికి గురై ఇంటి నుంచి బయటకు రాలేక ఆనారోగ్యానికి గురయ్యారట. ఈ తరుణంలో పెద్దాయన ఎదుటకు ఎవ్వరూ వెళ్ళి ముఖం చూపలేక బంగ్లాకు కొన్నాళ్ళు దూరమయ్యారు. దీంతో ఆయన వైద్యం కోసం విదేశాలు వెళ్ళిపోయారు. నాటి నుంచి జిల్లా టిడిపి, నాయకుడు లేని నావలా నడిచింది. చివరకు ఆయన వచ్చాక జిల్లా టిడిపిలో నూతనోత్సాహం వచ్చినా, తరువాత అశోక్ గజపతిరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండటంతో, మళ్లీ అగమ్యగోచరమైంది. ఇదే తరుణంలో జిల్లా నేతలంతా బంగ్లాకు వచ్చి పార్టీకి పెద్ద దిక్కుగా ముందుకు నడిపించాలని, రాజుగారిని కోరుతున్నారట. పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగానే ఉండటానికి ఇష్టపడుతున్నారట రాజు. దీంతో జిల్లా టిడిపి కార్యకర్తల్లో నిరాశ రాజ్యమేలుతోంది.

ఇక చేసేదేమీలేక జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల టీడీపీ నేతలందరూ సమావేశమై, స్థానిక ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించాలని మరోసారి అశోక గజపతిరాజును అడిగారట. అయినా ఆయన ఎంతమాత్రమూ ఆసక్తి చూపడం లేదట. అయితే, తన కుమార్తె పార్టీ కార్యకలాపాలు చూస్తారని ఘంటాపథంగా చెప్పారట రాజు. బహుశా కుమార్తెను జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా మార్చాలన్నది రాజుగారి ఆలోచనయి వుంటుందని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట. కానీ ఏమాత్రం అనుభవంలేని కుమార్తె నాయకత్వంలో ముందుకెళ్లేందుకు, ద్వితీయ శ్రేణి నాయకత్వం సిద్దంగాలేదట. అంతేకాదు, ఆమె పార్టీ బాధ్యతలు తీసుకుంటే, పార్టీని వీడేందుకూ కొందరు సిద్దమయ్యారట. మొన్నటి వరకు తనకు అనుకూలంగా ఉన్న నేతలు, తన కుమార్తె విషయంలో వ్యతిరేకంగా మారటంతో షాకైన అశోక గజపతి రాజు, ఏం చెయ్యాలన్నదానిపై డైలమాలో పడ్డారట. తన ఆరోగ్యమేమో సహకరించదు, తన కుమార్తె నాయకత్వాన్నేమో శ్రేణులు అంగీకరించడంలేదని మథనపడుతున్నారట. ఇటువంటి పరిస్థతిల్లో అశోక్ గజపతిరాజు మనస్సు మార్చుకుని జిల్లా టిడిపిలో పూర్వ వైభవం తేవడానికి ముందడుగు వేస్తారో, లేక తన వారసురాలిగా పరిచయం చేసిన అతిథి గజపతి కోసం, అందర్నీ ఏకతాటికి తెచ్చి, జిల్లాను నడిపించే బాధ్యతలను అప్పగించి, తప్పుకుంటారో చూడాలి.  

Tags:    

Similar News