అమరావతి సమరంలో బాలయ్య ఎక్కడ?

Update: 2020-01-13 05:22 GMT

రాజధాని రణరంగమవుతుంటే, నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్‌లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత కీలకమైన నందమూరి బాలకృష్ణ, ఇంతవరకూ మూడు రాజధానుల ప్రతిపాదనలపై నోరు విప్పలేదు ఎందుకు? కావాలనే సైలెంటయ్యారా? ఎందుకైనా మంచిదని సైడయ్యారా? తొడగొట్టి మీసం మెలేసే సమరసింహారెడ్డిలో ఈ బెరుకు ఎందుకు?

నందమూరి బాలకృష్ణ మాట్లాడినా సంచలనమే. మాట్లాడకపోయినా సంచలనమే. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఒకవైపు తెలుగుదేశం అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్‌ బాబులు ఆందోళనలు చేస్తున్నారు. అరెస్టులవుతున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. రైతులు, మహిళలకు మద్దతుగా ఊరూరా తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబయితే, ఏకంగా జోలె పట్టి ఉద్యమ నాయకులకు విరాళాలు సేకరిస్తున్నారు. పార్టీలో పునరుత్తేజానికి రాజధాని ఉద్యమాన్ని ఒక ఆయుధంగా మలచుకోవాలనుకుని, ఒకవైపు పార్టీ కీలక నాయకత్వమంతా, ఆందోళనల్లో పాల్లొంటూ వుంటే, నందమూరి వారసుడు మాత్రం, ఇప్పటి వరకు ఒక్క మాటా మాట్లాడకపోవడం, అమరావతి రైతులనే కాదు, తెలుగుదేశం శ్రేణులనూ విస్మయానికి గురి చేస్తోందన్న చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వారసుడిగా, రాబోయే కాలంలో కాబోయే పార్టీ కీలక నాయకుడిగా కార్యకర్తలంతా బాలయ్య, బాలయ్య అంటుంటే, ఆయన మాత్రం ఒక్క మాటా మాట్లాడకపోవడం తమ్ముళ్లను కుంగదీస్తోంది. అటు సినిమా హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సైతం మూడు రాజధానులపై తన అభిప్రాయమేంటో చెప్పారు. ఆందోళనలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మూడు రాజధానులపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించి, క్లారిటీగా వున్నారు. కానీ అదే సినిమా పరిశ్రమలో అగ్ర హీరో అయిన బాలయ్య మాత్రం, ఇంతవరకూ క్యాపిటల్స్‌పై ఒక్క పంచు డైలాగూ వెయ్యలేదని రగిలిపోతున్నారు అమరావతి అభిమానులు. సినిమా హీరోగా కాకపోయినా, తెలుగుదేశంలో కీలక నాయకుడిగానైనా, బాలయ్య స్పందించాల్సి వుండాల్సిందని, ఉద్యమానికి మరింత ఊపువచ్చేలా, తాను సైతం పాదం కదిపివుంటే, బాగుండేదని సగటు తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి సినీ అభిమానులూ కోరుకుంటున్నారు. కానీ నెలన్నర రోజులుగా అమరావతి అట్టుడికిపోతున్నా, బాలయ్య మాత్రం మౌనవ్రతంలోనే వున్నారు.

బాలయ్య సెలెన్స్‌‌కు కారణాలున్నాయా? మౌనం వ్యూహాత్మకమా? లేదంటే షూటింగ్‌లో బిజీగా వున్నారా?

బాలకృష్ణ మౌనానికి కారణాలున్నాయన్నది ఆయన సన్నిహితుల మాట. మూడు రాజధానులపై ఏది మాట్లాడినా తనకు ఇబ్బందేనన్నది ఆయన లెక్క. అమరావతిలోనే రాజధాని వుండాలంటే, రాయలసీమలో బాలయ్యకు ఇబ్బందులు తప్పవు. హిందూపరం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయనకు, రాజధాని వ్యవహారం నిజంగా తలనొప్పిలా మారిందన్నది పార్టీ నేతల వ్యాఖ్యలు. టీడీపీలో బాలయ్య కీలక నాయకుడైనా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నది రాయలసీమ నుంచే కాబట్టి, ఇక్కడ తన పట్ల ప్రజల్లో వ్యతిరేకభావం ఏర్పడుతుందని ఆలోచిస్తున్నారట. అందులోనూ సీమలోనే బాలయ్యకు ఫ్యాన్స్‌ ఎక్కువ. సీమ నేపథ్యంలో వచ్చిన సమరసింహారెడ్డి వంటి చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు తిరగరాశాయి. అందుకే మూడు రాజధానుల టాపిక్‌లో తలదూర్చితే, అటు నియోజకవర్గంలోనూ, ఇటు సీమలో ఫ్యాన్స్‌పరంగానూ ఇబ్బందేనని నందమూరి హీరో లెక్కలేస్తున్నారట.

ఇక ఉత్తరాంధ్ర. ఇక్కడా నందమూరి అభిమానులకు లెక్కేలేదు. పార్టీ విధానం ప్రకారం, విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తే, ఇక్కడా బాలయ్యకు ఇబ్బందే. రాజకీయంగా, సినిమాలపరంగా కూడా చిక్కులు తప్పవు. అంతేకాదు, తన చిన్నల్లుడు భరత్‌ విశాఖ నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాను అమరావతిని సమర్థిస్తూ, విశాఖను వద్దంటే చిన్నల్లుడికీ పొలిటికల్‌గా నెగెటివ్‌ సిచ్యువేషన్‌ ఫేస్‌ చెయ్యాల్సి వస్తుంది. అందుకే అటు రాయలసీమ, ఉత్తరాంధ్రను హర్ట్‌ చెయ్యకుండా, మౌనమే మేలనుకుంటున్నారట బాలకృష్ణ.

ఒకవేళ మూడు రాజధానులకు బాలయ్య ఓకే అంటే, ఇటు కృష్ణా, గుంటూరులో మరింత ఇబ్బంది. కృష్ణా తమ కుటుంబానికి సొంత జిల్లా కావడం, తమ సామాజికవర్గం బలంగా వుండటంతో, అమరావతిని వ్యతిరేకించలేని పరిస్థితి బాలయ్యది. మూడు ప్రాంతాలూ తనకెంతో కీలకమైనవిగా భావిస్తున్న నందమూరి హీరోకి, ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది మూడు రాజధానుల వ్యవహారం. అందుకే అన్నింటికీ మౌనమే మేలనుకుంటున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ ఒక్కరే మౌనంగా లేరు. టీడీపీలో చాలామంది పరిస్థితి కూడా అదే. మూడు రాజధానులపై టీడీపీలో మూడు ప్రాంతాల నాయకులూ మూడు వర్గాలుగా విడిపోయారు. ఎవరి ప్రాంతానికి వారు అనుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి. లేకుంటే ఉనికికే ప్రమాదం. విశాఖ రాజధానిగా అనుకూలమని,టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన అభిప్రాయం చెప్పారు. పార్టీ అధిష్టానం కూడా ఆ‍యనను ఏమీ అనలేదు. అటు రాయలసీమ నేతలు సైతం, గ్రేటర్‌ రాయలసీమకావాలంటూ, స్థానికంగా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, బాలయ్యలాంటి హీరో, పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా వుండి కడూ మౌనంగా వుండటం ఏమాత్రం మంచిదికాదంటున్నారు రాజధాని రైతులు. బాలయ్య ఉద్యమంలోకి దిగితే, మంచి ఊపొస్తుందని అంటున్నారు.

మరి అమరావతికి అనుకూలంగా మాట్లాడితే ఉత్తరాంధ్ర, సీమల్లో తనకు సినిమాలపరంగా, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని మౌనంగా వున్నారా అనుకూలంగా వ్యాఖ్యానిస్తే తనకెంతో కీలకమైన కృష్ణా, గుంటూరులో ఇబ్బందులు తప్పవని సెలెన్స్‌గా వున్నారా లేదంటే పార్టీ అధినేత చంద్రబాబు తనకెలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని ఊరికే ఉన్నారా ఇవన్నీకాదంటే సినిమాలతో బిజిబిజీ అయ్యారా అన్నది, బాలయ్య బాబుకే తెలియాలి. కానీ ఉద్యమంలో బాలయ్యలేని లోటు కనిపిస్తోందని ఇటు అమరావతి రైతులు మాత్రం భావిస్తున్నారట. చూడాలి, బాలయ్య ఎప్పుడు తొడగొడతాడో, ఎప్పుడు మీసం మెలేస్తాడో.

Tags:    

Similar News