Andhra Pradesh: తాడిపత్రిలో శాంతి మొక్కలు నాటిన గ్రామస్థులు
Andhra Pradesh: ప్రజల్లో వ్యతిరేక భావాలు తొలిగిపోవాలని కార్యక్రమం *ఫ్యాక్షన్ కార్చిచ్చు రగలకుండా ఉండేందుకు బిల్వ మొక్కలు
Andhra Pradesh: ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్రపడిన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో శాంతి మొక్కలు నాటుతున్నారు అక్కడి పల్లె జనం. ఇప్పటివరకూ ప్రశాంతంగా ఉంటూ ఉన్నతంగా ఎదిగిన గ్రామస్థులు కుళ్లు రాజకీయాల గొడవలకు పోకూడదని వేల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ఓ జోతిష్యుడు చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న స్థానికులు ఏకంగా 16 ఎకరాల్లో మొక్కలు నాటారు. ఒకనాటి ఆదర్శ నాయకుడు, మాజీ మంత్రి చల్లా సుబ్బరాయుడు, విశ్రాంత హైకోర్టు చీఫ్ జస్టీస్ చల్లా కొండయ్య స్వగ్రామం చల్లవారిపల్లి, జంబులపాడులో బిల్వ మొక్కల పెంపకం.
ప్రజల్లో వ్యతిరేక భావాలు తొలిగిపోయి.. ఎదుటివారి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడాలన్న లక్ష్యంతో ఆ గ్రామాల్లో మొక్కలు నాటే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఫ్యాక్షన్ కార్చిచ్చు రగలకుండా ఉండేందుకు బిల్వ మొక్కలను నాటాలని నిశ్ఛయించుకున్నారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చల్లవారిపల్లి, జంబులపాడు గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బిల్వ వృక్షాలు నాటితే ఆ గ్రామ ప్రజల్లో వ్యతిరేక ఆలోచనలు పోయి శాంతిగా జీవిస్తారని ఓ జోతిష్యుడు చెప్పడంతో దాన్ని గ్రామస్థులు ఆచరణలో పెట్టారు. చల్లా రాజేంద్రప్రసాద్ స్వగ్రామం చల్లవారి పల్లెలో గంగమ్మ దేవాలయం కోసం 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దేవుని మాన్యంగా ఇచ్చారు. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టారు. సుమారు ఐదు వేలకు పైగా బిల్వ మొక్కలను దేవుని మాన్యం 16 ఎకరాల్లో నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, గ్రామస్థులందరి సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రతీ ఒక్కరూ సొంత ఊరి కోసం కొంతైనా ఆలోచించాలని... పల్లెల అభివృద్ధికి సాయపడితే కరవు పల్లెలు పచ్చగా మారుతాయని పల్లె జనం అంటున్నారు.