మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అసహనం
*దత్తత తీసుకున్నలంక గ్రామాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న గ్రామాలను ఆమె సందర్శించారు. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం నరసాపురం తీరంలో సముద్ర కోత నివారణకు నిర్మిస్తున్న గోడ పనులను పరిశీలించారు. దేశంలో ఇలాంటి గోడలు ఇప్పటి వరకు రెండు చోట్ల మాత్రమే నిర్మించారని గుర్తు చేశారు. ఇక గోదావరి జిల్లాల్లో తాగునీరు లేకపోవడంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో రక్షిత తాగునీటి పదకాన్ని ఆమె ప్రారంభించారు. సమీప గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడం పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితమే సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసినప్పటికీ.. మంచినీటి సౌకర్యం ఎందుకు కల్పించలేదో ప్రజలు ప్రశ్నించాలన్నారు. మత్స్య గ్రామంతోపాటు.. మిగతా ఆరు గ్రామాల్లో తాగునీటి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. దత్తత తీసుకున్న పీఎం లంక గ్రామానికి వస్తే నాకు సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందన్నారు కేంద్రమంత్రి నిర్మల.