జగన్ ఆస్తుల కేసు: పూర్తి వివరాలివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
Supreme Court: జగన్ ఆస్తుల కేసుల పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Supreme Court: జగన్ ఆస్తుల కేసుల పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి విచారణను బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి ఏఏ కోర్టుల్లో ఎన్ని కేసులున్నాయనే విషయమై పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ ఎందుకు జరగడం లేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. డిశ్చార్జి పిటిషన్లున్నందున వాటిపై విచారణ కారణంగా రోజువారీ విచారణకు ఆటంకం ఏర్పడుతున్న విషయాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
తెలంగాణ హైకోర్టు, సీబీఐ కోర్టులతో పాటు సుప్రీంకోర్టులో ఏఏ కేసులున్నాయనే విషయమై పూర్తి వివరాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసు విచారణను 2025, జనవరికి వాయిదా వేయాలని సుప్రీంకోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు. అయితే డిసెంబర్ 16న విచారణను వాయిదా వేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఆ రోజున తనకు హాజరు కావడం సాధ్యం కానందున మరో రోజున కేసును వాయిదా వేయాలని జగన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. దీంతో ఈ కేసు విచారణను డిసెంబర్ 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.