Pawan Kalyan: కాకినాడ పోర్టు అధికారులకు చుక్కలు చూపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం పట్టివేతతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పేరు మరోసారి మీడియాలో చర్చకు కారణమైంది.

Update: 2024-11-30 09:25 GMT

Pawan Kalyan: కాకినాడ పోర్టు అధికారులకు చుక్కలు చూపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం పట్టివేతతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు మరోసారి మీడియాలో చర్చకు కారణమైంది. అధికారంలో ఉన్నా తప్పు అనిపిస్తే పబ్లిక్ గానే మాట్లాడుతున్నారు. కొన్ని సమయాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అయినా కూడా ఆయన వెనక్కు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో తానే హోంమంత్రినైతే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనానికి కారణమయ్యాయి. రేషన్ బియ్యాన్ని దక్షిణాఫ్రికాకు సరఫరా చేస్తున్న నౌకను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీలో చర్చకు కారణమైంది.


కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణపై విపక్షంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ రేషన్ బియ్యం సరఫరాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దక్షిణాఫ్రికాకు తరలిస్తున్న 1064 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ ప్రాంతానికి తాను రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. వాతావరణం బాగా లేదని.. ఇతరత్రా కారణాలతో తనను రాకుండా అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. 10 వేల కుటుంబాలు ఆధారపడ్డాయని.. బియ్యం అక్రమ రవాణా విషయంలో తన చేతులు కట్టేసే పనులు చేశారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అధికారుల తీరుకు అద్దం పడుతున్నాయి. మరో వైపు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబును కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కూడా సర్వత్రా చర్చకు దారితీసింది.


కాకినాడ పోర్టు అక్రమాలకు అడ్డాగా మారిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రేషన్ బియ్యం పోర్టు నుంచి విదేశాలకు తరలివెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజా ప్రతినిధులు, నాయకులు వచ్చి అక్రమ రవాణాను అడ్డుకోవాలా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలివెళ్తుంటే అధికారులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.


కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ప్రధాని మోదీకి,కేంద్ర హోంశాఖ మంత్రికి పవన్ కళ్యాణ్ లేఖ రాయనున్నారు. తీరప్రాంతంలో ఉన్న సంస్థలు, కంపెనీల రక్షణ కోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారితో పాటు దీని వెనుక ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా సాగుతున్నప్పుడు అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా అని ఆయన ప్రశ్రించారు.


కాకినాడ పోర్టు ఘటనతో తప్పు జరిగితే సహించబోమని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వ పెద్దలను, కూటమి నాయకులను అలర్ట్ చేశారని వాదన కూడా ఉంది.జగన్ సీఎంగా ఉన్న సమయంలో తప్పులు జరిగాయని ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ చేశారు.

Tags:    

Similar News