విశాఖ రుషికొండ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ
*హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగం గందరగోళంలో ఉందని వెల్లడి
Visakhapatnam: విశాఖ రుషికొండ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రైబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని సుప్రీంకోర్టు తేల్చింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని సూచించింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగం గందరగోళంలో ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపొద్దని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు కల్పించింది.