Yanam: మామ ఆషాఢం గిఫ్ట్‌కు అల్లుడు శ్రావణం రిటర్న్‌ గిఫ్ట్

Yanam: వందల కేజీల కాయగూరలు.. నాటు కోళ్లు.. మేకలు.. చేపలు.. స్వీట్స్‌తో అబ్బురపరిచేలా కొత్త అల్లుడికి మామగారు ఇచ్చిన ఆషాఢం గిఫ్ట్ మీకు గుర్తుంది కదా..

Update: 2021-08-12 09:04 GMT

Yanam: మామ ఆషాఢం గిఫ్ట్‌కు అల్లుడు శ్రావణం రిటర్న్‌ గిఫ్ట్

Yanam: వందల కేజీల కాయగూరలు.. నాటు కోళ్లు.. మేకలు.. చేపలు.. స్వీట్స్‌తో అబ్బురపరిచేలా కొత్త అల్లుడికి మామగారు ఇచ్చిన ఆషాఢం గిఫ్ట్ మీకు గుర్తుంది కదా.. అప్పుడు పెళ్లి కుమార్తె ఇంటి నుంచి కొత్త అల్లుడికి ఎవరూ ఉహించని రేంజ్ లో ఆషాఢం ఆఫర్ ఇచ్చారు మామగారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో రిటర్న్ గిఫ్ట్ తో తన భార్యను తీసుకువెళ్లేందుకు కొత్త అల్లుడు అదే స్థాయిలో శ్రావణం సారేతో అత్తవారింటికి వెళ్లడం తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు సంప్రదాయాల పుట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లా. ఆ జిల్లాలో గత నెల ఆషాఢ మాసం సారే అందరినీ అబ్బుర పరచింది. టన్నులకొద్ది చేపలు.. కూరగాయలు.. మిఠాయిలతో పాటు 10 మేకపోతులు.. 50 నాటుకోళ్లు.. కిరాణా సరుకులు.. పచ్చళ్లు.. ఇలా ఏది లేదనుకోకుండా ప్రతీదానిని యానం అల్లుడి ఇంటికి పంపించారు కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బలరామకృష్ణ. సాంప్రదాయలను గుర్తుచేస్తూ కావిళ్లతో ఆయన పంపించిన సారే అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గోదావరి జిల్లాల్లో ఆతిథ్యం ఈ రేంజ్ లో ఉంటుందని ప్రత్యక్షంగా చూపించారు. ఆ చర్చ ఇంకా కొనసాగుతుండగానే మరోసారి ఆ కుటుంబం వార్తల్లో నిలిచింది.

ఆషాఢమాసం ముగిసి శ్రావణం ప్రారంభం కావడంతో మామగారు బలరామకృష్ణ ఇంటికి అల్లుడు పవన్ కుమార్ కూడా రిటర్న్ గిఫ్ట్ తో వెళ్లారు. తన భార్య ప్రత్యూషదేవీని తీసుకువెళ్లేందుకు గాదరాడ వెళ్లిన పవన్ కుమార్ ఏకంగా పది టన్నుల స్వీట్స్ ను తీసుకెళ్లారు. నోరూరించే 20 రకాల స్వీట్స్ తో యానం నుంచి ప్రత్యేకంగా అలకరించిన వాహనాల్లో సారేను తీసుకుని గాదరాడకు చేరుకున్నారు పవన్ కుమార్ కుటుంబసభ్యులు. గాదరాడ గ్రామానికి చేరుకోగానే సంప్రాదయాల ప్రకారం కావిళ్లతో స్వీట్స్‌ను మామ బలరామకృష్ణ ఇంటికి తీసుకెళ్లారు. ఒక కుటుంబానికి సంబంధించిన వేడుకలా కాకుండా గ్రామం మొత్తం పండుగ చేసుకునేలా శ్రావణం సారే వేడుకను నిర్వహించారు.

యానం నుంచి శ్రావణం సారే కావిళ్ళతో అత్తవారింటికి వెళ్లిన అల్లుడు పవన్‌ కుమార్‌కు గాదరాడలో ఘనస్వాగతం లభించింది. వివాహం అంటేనే పండగ వాతావరణంలో నిర్వహించాల్సిన వేడుక. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వివాహం ఘనంగా చేయలేకపోయిన బలరామకృష్ణ ఆ తరువాత జరిగే ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆషాఢంలో తాము పంపిన సారే కావిళ్లకు ధీటుగా శ్రావణంలో కావిళ్లతో వియ్యంకులు సారే తీసుకురావడం ఆనందాన్నిచ్చిందని బాలరామకృష్ణ తెలిపారు.

20 రకాల నోరూరించే 10 టన్నుల స్వీట్స్ తో పాటు అరటిగెలలు, వివిధ రకాల పళ్లతో కూడిన శ్రావణం సారెతో తోట పవన్ కుమార్ కుటుంబసభ్యులు గాదరాడ విచ్చేసారని తెలిపారు. తెలుగు సాంప్రదాయాలను గుర్తుచేసుకుంటూ భావితరాలను మన ఆచార వ్యవహారాల గురించి తెలిపేందుకే కాస్తంత ఖర్చు ఎక్కువైనా ఘనంగా నిర్వహించామన్నారు. సారేను వివాహమైన తర్వాత రెండు కుటుంబాలు ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఆ దంపతుల జీవితం చల్లగా ఉంటుందనే నమ్మకం ఎప్పటి నుంచో ఉందన్నారు. వియ్యాలవారు పంపించిన శ్రావణం సారేను గ్రామంలో ప్రతీ కుటుంబానికి అందచేస్తామన్నారు బలరామకృష్ణ. ముత్తైదువులు పవన్ కుమార్, ప్రత్యూషదేవి దంపతులను ఆశీర్వదించారు. 

Tags:    

Similar News