తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఎఫెక్ట్
Solar Eclipse: పాక్షిక సూర్యగ్రహణంతో ఆలయాల మూసివేత, సంప్రోక్షణ అనంతరం దర్శనానికి అనుమతి
Solar Eclipse 2022: పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకోనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7గంటల 30నిమిషాల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రహణ సమయంలో తిరుమలలో అన్నవితరణ, లడ్డుప్రసాదాల పంపిణీ నిలిపివేశారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేసి, శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమలలో సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈరోజు జరగాల్సిన నిత్యకైంకర్యాలు ఆర్జిత సేవలు నిలిపివేసినట్టు ఆలయ అర్చకులు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాక్షిక సూర్య గ్రహణం సందర్భంగా...ఆలయాలను మూసివేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న నీలకంటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి మూసివేసినట్టు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత పూజలు ప్రారంభం కానున్నాయి. అనంతరం భక్తులకు దర్శన అనుమతి ఉంటుంది.
సూర్యగ్రహణం సందర్భంగా మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. సూర్యగ్రహణం ముగిసిన అనంతరం ఆలయం శుద్ధిచేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
కేతుగ్రస్త సూర్య గ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. అంతకుముందు అమ్మవారికి మంత్ర పుష‌్పహారతి నిర్వహించారు. సాయంత్రం 7గంటలకు ఆలయ సంపోక్షణ చేయనున్నారు. అభిషేకం హారతి నిర్వహించి అర్చకులు తిరిగి ద్వారబంధనం చేయన్నారు.
సూర్యగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం అనంతరం ఆలయ సంపోక్షణ జరపనున్నారు. భక్తులను రేపు ఉదయం దర్శనానికి అనుమతివ్వనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి అనంతరం స్వామి వారికి పూజలు నిర్వహించనున్నారు. రేపు 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
సూర్యగ్రహణం సందర్భంగా.. అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. శాస్త్రోక్తంగా ఆలయంలో పూజలు నిర్వహించి మూసివేశారు. గ్రహణం ముగిసిన తరువాత సంప్రోక్షణ చేపట్టి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించనున్నారు.
పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. గ్రహణం అనంతరం రాత్రి 7గంటల 15 నిమిషాలకు ఆలయాన్ని సంపోక్షణ చేయనున్నారు. రేపు ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.