sand shortage in visakhapatnam: ఒక వైపు కరోనా , మరో వైపు ఇసుక కొరత కూలీలను కష్టకాలంలోకి నట్టేస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మాణ రంగం విస్తరించిన విశాఖ జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. లాక్‌డౌన్ ప్రభావంతో నిలిచిపోయిన నిర్మాణాలు ఒకవేళ తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సరిపడా ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో భవన నిర్మాణ కార్మికులు లబోదిబో మంటున్నారు.
స్మార్ట్ సీటీలో ఇసుక బంగారమైపోయింది. సాధారణ ప్రజలు కొత్తగా ఇళ్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇళ్ల మరమ్మత్తులు చేసుకొనే వారు కూడా అవసరమైన కొద్దిపాటి ఇసుకను పొందలేని పరిస్థితి నేటికీ కొనసాగుతూనే ఉంది. సచివాలయాలకు వెళ్లి అక్కడి నుంచి ఆన్ లైన్ల్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఆన్ లైన్ ద్వారానే సొమ్ము చెల్లిస్తే ఒక్క రోజులోనే ఇసుక ఇంటికి డెలవరీ వస్తుందనే మాటలు ప్రకటనలకే పరిమితమయ్యిందని అత్యధికులు విమర్శిస్తున్నారు.
మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రభావంతో భవన నిర్మాణ పనులు నిలిపి వేశారు బిల్డర్లు. ప్రభుత్వం భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంతో పనులు మొదలు పెట్టినా, ఇసుక కొరత ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే విశాఖలో ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించి రోజులకు రోజులు ఎదురు చూస్తున్నా ప్రయోజనం శూన్యమని సామన్యులతో పాటు భవన నిర్మాణ కార్మికులు వాపోతున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుండి నేటి వరకు తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. జిల్లాలోని ముడసర్లోవ, ఆగనంపూడి, నక్కపల్లి, అనకాపల్లి, అచ్యుతాపురం, నర్సీపట్నం, చోడవరం, భీమిలిలో ఇసుక యార్డులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఇసుక సరఫరా జరుగుతోంది. ఐనా ఇసుక అందుబాటులో లేక వినియోగదారులు నానా అగచాట్లు పడుతున్నారు.