అద్భుతం..విశాఖ సాగర గర్భంలో సహజ శిలాతోరణం
*సముద్ర తీరానికి 2 కి.మీ. దూరంలో 30 అడుగుల లోతులో గుర్తింపు *స్కూబా డైవర్ల అన్వేషణలో బయట పడ్డ శిలాతోరణం *సముద్ర గర్భంలో 45 నిమిషాల పాటు ఉపరితలం రికార్డు *వేల ఏళ్లుగా అలల తాకిడికి సముంద్రంలోని కొండ....
విశాఖలోని రుషికొండ సముద్ర తీరానికి.. రెండు కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భంలో 30 అడుగుల లోతున సహజ శిలాతోరణం అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. 'లివ్‌ఇన్ అడ్వంచర్'కు చెందిన స్కూబా డైవర్లు, సుమారు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో ఉండి ఆ పరిసరాలను రికార్డు చేశారు.
రుషికొండ సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 30 అడుగుల లోతున సహజ శిలాతోరణం గుర్తించారు. భారీ శిల మధ్య నుంచి గుహలా ఇవి ఏర్పడినట్లు అన్వేషకులు చెబుతున్నారు. విశాఖకు చెందిన 'లివ్‌ఇన్ అడ్వంచర్'కు చెందిన స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో తరచూ కొత్త ప్రాంతాల అన్వేషణ చేస్తుంటారు. ఇందులో భాగంగా నలుగురి బృందం గతంలో ఎప్పుడూ చూడని శిలలతో కూడిన తోరణం లాంటి ఆకారాన్ని గుర్తించింది.
అయితే సుమారు 45 నిమిషాల పాటు సముద్ర గర్భంలో ఉండి ఆ పరిసరాలను రికార్డు చేశారు. ఇది ప్రస్తుతం విశాఖలోని మంగమారిపేట సముద్ర తీరంలోని శిలాతోరణాన్ని పోలి ఉందని చెబుతున్నారు. కొన్ని వేల సంవత్సరాలు సముద్రంలోని కొండ అలల తాకిడికి అలా మారి ఉంటుందని బృంద సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే, సముద్ర గర్భంలో 30 అడుగుల లోతు వరకు వెళ్లిన పర్యాటకులు మాత్రం ఓ వైపు భయపడినా... మరోవైపు మరో ప్రపంచాన్ని చూసామని సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. మరోసారి బృంద సభ్యులతో శిలాతోరణం వద్దకు వెళ్లి మరిన్ని విషయాలు తెలుసుకుంటామని లివ్‌ఇన్ అడ్వంచర్ నిర్వహకులు అంటున్నారు.