Sangameswaram Temple Kurnool: సంగమేశ్వరుడుని చుట్టేసిన గంగమ్మ..
Sangameswaram Temple Kurnool: జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వస్తున్నాయి.
Sangameswaram Temple Kurnool: జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్ లోకి భారీగా వస్తున్నాయి. దీంతో శ్రీశైలం డ్యామ్ లో క్రమంగా నీటిమట్టం పెరుగుతూ రేడీఎల్ క్రస్ట్ గేట్లను తాకాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నీటి నిల్వ 66.01 టీఎంసీలకు చేరుకుంది. నిన్న ఏకంగా ఆరు టీఎంసీలు వరదనీరు చేరింది. మరోవైపు కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం ఆదివారం సాయంత్రం నాటికి కృష్ణా జలాలు చుట్టేయడంతో.. ఆలయం గంగమ్మ ఒడిలోకి చేరుతోంది. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వరం ఉంది. ఏకంగా ఇక్కడ ఏడునదులు కలిసే ప్రదేశం. కాబట్టి ఈ ప్రాంతాన్ని సప్తనదుల సంగమం అంటారు. ఏడు నదులు కలిసే చోట ఆలయమే సంగమేశ్వర దేవాలయం.
ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం ఈ ఆలయం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. భూమిమీద ఎక్కడ.. ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం రాతితో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం శివలింగం వేపకొమ్మతో ఉంటుంది. పాండవులు వనవాసంలో పూజ చేసుకోవడానికి వేపచెట్టు కొమ్మని ఇక్కడ ప్రతిష్టించి పూజలు చేసినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆ వేప శివలింగం ఇక్కడ అలాగే ఉంది.