Tirupati Laddu: లడ్డూలకు అనూహ్యంగా పెరిగిన డిమాండ్.. రోజుకు ఎన్ని విక్రయిస్తున్నారంటే!

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం వెలుగు చూసిన తర్వాత కూడా అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు.

Update: 2024-09-26 06:50 GMT

తిరుపతి లడ్డూ వివాదం: తగ్గని అమ్మకాలు, రోజుకు 3 లక్షలకు పైగా లడ్డూల అమ్మకాలు

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం వెలుగు చూసిన తర్వాత కూడా అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు. ఈ నెల 19 నుంచి 25 మధ్య అంటే వారం రోజుల్లో 23 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగాయి. టీటీడీ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. ప్రతి రోజూ కనీసం మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తారు.

తగ్గని తిరుపతి లడ్డూల విక్రయాలు

తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ప్రకటించారు. ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నెల 19 నుంచి 25 వరకు 23 లక్షల లడ్డూలు విక్రయించినట్టుగా టీటీడీ అధికారులు చెబుతున్నారు. సగటున ఒక్క రోజుకు 3.28 లక్షల లడ్డూలు అమ్మారు. నెయ్యి కల్తీ అంశం బయటకు రావడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీ కొనుగోలు చేస్తోంది. 2023 వరకు ఇదే బ్రాండ్ నెయ్యిని టీటీడీ ఉపయోగించింది.

ఏఆర్ డెయిరీపై తిరుపతిలో కేసు

లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుందని తేలడంతో ఆ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీకి ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీస్ జారీ చేసింది. జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని సరఫరా చేసినందుకు లైసెన్స్ ను ఎందుకు సరఫరా చేయకూడదో చెప్పాలని ఆ నోటీస్ లో కోరారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అడిటివిస్ రెగ్యులేషన్ 2011 ప్రకారంగా ఈ నోటీస్ ను జారీ చేశారు. ఏఆర్ డెయిరీ టీటీడీ ప్రొక్యూర్ మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి. మురళీకృష్ణ ఏఆర్ డెయిరీపై తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టంలోని 51, 59 సెక్షన్లను ఉల్లంఘించిందని... ఇది శిక్షార్హమైన నేరమని ఆ ఫిర్యాదులో టీటీడీ తెలిపింది. ఈ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ చట్టంలోని 3(5), 274,275, 316 (3), 318 (3) 318 (4), 61 (2), 299 ఆర్ డబ్ల్యూ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

తిరుపతి లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

తిరుపతి లడ్డూ వివాదంపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్ గా నియమించింది ప్రభుత్వం. ఇందులో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు సభ్యులుగా ఉన్నారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి ఎలా టీటీడీకి సరఫరా చేశారనే విషయమై విచారించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే సిట్ కు సర్వశ్రేష్ట త్రిపాఠిని ఇంచార్జీగా నియమించడంపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు త్రిపాఠి గుంటూరు ఐజీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే పోలింగ్ రోజు ఎక్కువగా ఘర్షణలు జరిగాయని ఆ పార్టీ ఆరోపణలు చేసింది.

తిరుపతికి వెళ్లనున్న జగన్

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు నెయ్యి అంశం కూడా అప్పటి టీటీడీ పాలకవర్గం హయంలో జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఆరోపణలను జగన్ తోసిపుచ్చారు. ఈ నెల 27న వైఎస్ జగన్ తిరుపతికి చేరుకుంటారు. ఈ నెల 28న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అే రోజున రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొనాలని ఆయన ఆ పార్టీ శ్రేణులను కోరారు.

తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదేపిస్తోంది. ఈ అంశం వెలుగు చూడడంతో దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల పాలకవర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి.

Tags:    

Similar News