సీఎం జగన్‌పై అనంత నేతల అలక ఎందుకు?

Update: 2019-06-18 06:48 GMT

ఆ జిల్లా ఆశించినదానికంటే, ఊహించినదానికంటే, ఆ పార్టీకి ఎక్కువే ఇచ్చింది. కానీ ఆ జిల్లా ఆశించి, ఊహించిన ఫలితం మాత్రం ఆ పార్టీ అధిష్టానం నుంచి రాలేదు. అందుకే ఆ జిల్లా అలిగింది. జిల్లా నేతలంతా అలకపాన్పు ఎక్కారు. ఇంతకీ ఏం ఆశించారు. ఏం ఊహించారు? అనంతపురం జిల్లా. టీడీపీకి కంచుకోట. అయతే ఈసారి వైసీపీకి బ్రహ్మరథం పట్టింది అనంత జిల్లా. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది వైసీపీ. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల మాత్రమే గెలిచారు. మిగతా అభ్యర్థులందరూ ఫ్యాన్‌ గాలి తుపానులో కొట్టుకుపోయారు. అయితే 12 మంది ఎమ్మెల్యేలను అందించినా, తమకు మంత్రి పదవుల్లో న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందుతున్నారు అనంత వైసీపీ ఎమ్మెల్యేలు.

జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని పలువురు సీనియర్ నేతలతో పాటు జూనియర్లూ మంత్రి పదవులు ఆశించిన వారిలో ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో అత్యంత సీనియర్ నేత, నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన, తాజాగా అనంతపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంత వెంకట్రామిరెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని అంతా భావించారు. చివరి నిమిషం వరకూ ఆయనకు పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ వెంకట్రామిరెడ్డికి నిరాశ తప్పలేదు. ఆయనతో పాటు రాయదుర్గం నియోకవర్గం నుంచి గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డి పదవిని ఆశించారు. 2009 లో కాంగ్రెస్ తరఫున గెలిచినా, అనంతరం పదవికి రాజీనామా చేసి వైసీపీతరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తాజా ఎన్నికల్లో మంత్రి కాల్వ శ్రీనివాసులుపై విజయం సాధించారు. ఈసారి జగన్ మంత్రి వర్గంలో తనకు బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందని, అందరికీ చెప్పుకున్నారు. కానీ ఛాన్స్‌ రాక నిరాశ చెందారు కాపు రామచంద్రారెడ్డి.

ఎస్సీ రిజర్వ్‌డ్ శింగనమల నియోకవర్గం నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని ఏదో ఒక పదవి వరిస్తుందని ఆశించారు. ఇక హిందూపురం పార్లమెంట్ పరిధిలో బీసీ నేత, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన శంకరనారాయణతో పాటు రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పదవులు ఆశించారు. ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలు సాగించారు. చివరి వరకూ ప్రకాష్ రెడ్డిపేరు వినిపిస్తూ వచ్చింది. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంపై విజయం సాధించడంతో పదవి వరిస్తుందని ఆశించారు. కానీ అదేమి జరగలేదు.

జిల్లా నుంచి కచ్చితంగా ఇద్దరు మంత్రులు ఉంటారని అంతా భావించారు. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు అదే సందేశం ఇచ్చారు. మంత్రి మండలిలో శంకరనారాయణతో పాటు అనంత వెంకట్రామిరెడ్డికి పదవి గ్యారెంటీ అన్న ప్రచారం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకరి చొప్పున ఉంటుందని ఆశించారు. అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ వైఎస్ ఆర్ సీపీ అధిష్టానం చివరికి పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణను మాత్రమే క్యాబినెట్‌లోకి తీసుకుంది. అనంత వైసీపీ నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముందు నుంచి పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన నేతలు, సీనియర్ ఎమ్మెల్యేలు,కష్టపడిన వారికి న్యాయం జరగలేదన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

శంకరనారాయణకు అప్రాధాన్యమైన పోస్టు ఇచ్చారని కూడా రగిలిపోతున్నారు. అయితే సామాజిక సమతూకానికి పెద్దపీట వేశామని, పదవులు రానివారు నిరాశ చెందొద్దని పార్టీ అధిష్టానం అసంతృప్తులను చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు రెండున్నరేళ్ల తర్వాత మంత్రివిస్తరణ పునర్‌వ్యవస్థీకరణలో చోటిస్తామని కూడా హామి ఇస్తోంది. దీంతో ప్రస్తుతానికి ఆగ్రహం చల్లారినా, రాబోయే కాలంలో కాబోయే కేబినెట్‌ మినిస్టర్‌ తామేనని, సర్ది చెప్పుకుంటున్నారు అనంత వైసీపీ నేతలు.

Full View

Tags:    

Similar News