Ramgopal Varma: నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో సినిమా కథలు రాసుకుంటా

తనను అరెస్ట్ చేస్తే జైల్లో సినిమా కథలు రాస్తానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సోమవారం హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-12-02 13:40 GMT

తనను అరెస్ట్ చేస్తే జైల్లో సినిమా కథలు రాస్తానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సోమవారం హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై అరెస్ట్ వారంట్ లేదని ఆయన చెప్పారు. గతంలో సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టులకు సంబంధించి రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని ఆయన చెప్పారు. ఎప్పుడో చేసిన పోస్టులకు మనోభావాలు దెబ్బతిన్నాయని వేర్వేరు పోస్టుల్లో ఇప్పుడు కేసులు నమోదు చేయడంపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. తన కేసు విషయమై మీడియా అత్యుత్సాహం చూపిందన్నారు.

తనపై నమోదైన కేసులకు సంబంధించి పోలీసులకు సమాధానం ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కార్యక్రమాలతో పోలీసుల విచారణకు హాజరు కాలేదన్నారు. తాను హైద్రాబాద్ లోనే ఉన్నానని చెప్పానని.. మీడియా చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పోస్టులపై కేసులు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై వ్యూహం సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారని 2024 , నవంబర్ 11న ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్ లలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి.

మద్దిపాడు పోలీసుల విచారణకు హాజరుకాని వర్మ

మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నవంబర్ 19, నవంబర్ 25న ఆయన విచారణకు హాజరు కావాలి. అయితే ఈ రెండు రోజుల్లో ఆయన విచారణకు హాజరు కాలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు తాను విచారణకు హాజరు కాలేనని సమయం కావాలని నవంబర్ 19న విచారణకు హాజరు కాకుండా సమయం కోరారు. నవంబర్ 25న విచారణకు హాజరు కాలేదు.

Tags:    

Similar News