Nagababu Tweet: రూట్ మార్చుకో... నాగబాబు ట్వీట్‌పై చర్చ
నాగబాబు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ పై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
నాగబాబు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్‌పై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల కాబోతున్న తరుణంలో ఈ పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి.
నాగబాబు ట్వీట్‌లో ఏముంది...
నువ్వు అడ్డదారిలో వెళ్తున్నావని గ్రహిస్తే వెంటనే నీ దారి మార్చుకో. నువ్వెంత ఆలస్యం చేస్తే నీ మూలాల దగ్గరికి చేరుకోవడం అంత కష్టమౌతోందని... స్వామి వివేకానంద కొటేషన్‌ను పోస్టు చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇదే తరహాలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సహాయం చేసేవాడు పరాయివాడైనా వాడు మనవాడే. కానీ, మనవాడైనా సహాయం చేయకపోతే పరాయివాడేనని ఆయన అప్పట్లో చేసిన ట్వీట్ కూడా చర్చకు కారణమైంది. ఈ ట్వీట్ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు నాగబాబు దూరంగా ఉన్నారు.
నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన శిల్పా రవి రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో ఉన్నారు. కానీ, ఆ సమయంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది. ఈ ఘటన కూడా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య గ్యాప్‌ను మరింత పెంచిందనే ప్రచారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో కారణాలు తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.