Rain Alert: తెలుగు రాష్ట్రాలను మరోసారి అలర్ట్ చేసింది వాతావరణ కేంద్రం. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఏపీలోని బాపట్ల, పల్నాడు, ప్రకారం, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య భారీ వర్షాలు కురిసాయి. ఈసారి ఆగస్టు నెలలో మినహా..మిగిలిన అన్ని నెలల్లోనూ ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. దీంతో ఈ సంవత్సరం భారీగా వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అక్టోబర్ నెలలోనూ బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రం నేడు భారీ వర్షాలకు అవకాశం లేదని..తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పలుచోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయన్నారు.
అయితే నైరుతీ బంగాళాఖాతంలో నేడు సాయంత్రం లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాలు మినహా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అల్పపీడన ప్రభావంతో నవంబర్ 7 నుంచి 11 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.