Pawan Kalyan: జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం

Pawan Kalyan: కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు

Update: 2023-10-02 01:30 GMT

Pawan Kalyan: జగన్ ఓటమి ఖాయం.. మేం అధికారంలోకి రావడం ఖాయం

Pawan Kalyan: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసిపి మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కురుక్షేత్ర యుద్ధం అంటున్న జగన్ అండ్ కో కౌరవులని, తామే తప్పక విజయం సాధించిన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.

వారాహి యాత్ర నాలుగో విడతలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో జనసేనాని బహిరంగసభ నిర్వహించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ అవనిగడ్డకు చేరుకున్నారు. వారాహి యాత్రకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి వాహనం నుంచి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనసేన – తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయని, సంకీర్ణ ప్రభుత్వం స్థాపించి తీరుతామని చెప్పారు. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, 175కు 175 గెలుస్తామంటున్నారని... ఓటమి తప్పదని జగన్‌కు తెలుసన్నారు‌. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్పేనన్నారు. వచ్చే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో ముఖ్యమంత్రి పోలుస్తున్నారని, వైసిపి వారు కురుక్షేత్రంలో కౌరవులో, పాండవులో తేల్చుకోవాలన్నారు. 151 మంది ఉన్నారు కాబట్టి కచ్చితంగా వైసిపి వారే కౌరవులే అని తాను భావిస్తానన్నారు పవన్.

అవనిగడ్డ ప్రాంతం ఒకప్పుడు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వేదికగా ఉండేదని, ఇక్కడ ఉండే సుమారు 80 నుంచి 100 శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కళకళలాడేవన్నారు. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థుల వేదన చూస్తే బాధగా ఉందని, 2018 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేదన్నారు. 50 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని అభ్యర్థులు చెబుతున్నారని తెలిపారు. తాను నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో జనసేన – తెలుగుదేశం పార్టీలను ఆశీర్వదించాలని పవన్ కోరారు. అయితే బిజెపి తో మాత్రమే కలిస్తే ఓట్ల శాతం పెరిగినా... ప్రభుత్వం స్థాపించే పరిస్థితి లేదన్నారు. 

వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న పవన్... బిజెపిని కలపకపోవడంపై రాజకీయ చర్చకు దారి తీసింది. మరి ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో‌ చూడాలి.

Tags:    

Similar News