డబ్బులు తీసుకుని ఓట్లేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి : పవన్

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. గురువారం అయన జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో ముచ్చటించారు.

Update: 2020-02-13 11:06 GMT

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. గురువారం అయన జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో ముచ్చటించారు. రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని అయన అన్నారు.. బాధ్యతగల ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇదేనని ప్రజలకి చురకలంటించారు పవన్ .. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. డబ్బులు పడేశాం కాబట్టి ప్రజలు ఓటేశారని, ఇక వారికి పని చేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారు. కనుక ఆలోచించి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలన్నారు. ఇది ఒక్క కర్నూలుకే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ వర్తిస్తుందని పవన్ పేర్కొన్నారు.

గురువారం ఉదయం కర్నూలు ఓల్డ్‌ సిటీ జమ్మి చెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్‌ లైన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణాన్ని పవన్ పరిశీలించారు. బ్రిడ్జ్‌ పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎందుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ గారు మాట్లాడుతూ.. "ఇంతకు ముందు ప్రజాప్రతినిధి, ఇప్పటి ప్రజాప్రతినిధి మధ్య తగాదాల వల్ల ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జ్‌ నిర్మాణం నిలిచిపోవడం బాధాకరం. రెండు, మూడు కోట్లు పెడితే పూర్తయిపోయే పనులను కూడా నిర్లక్ష్య ధోరణితో వదిలేశారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేసి... కొత్తవి ప్రారంభించడం వల్ల ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు... ముందు 10 వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి. దీనికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే ప్రజలు కూడా క్షమించరని పవన్ అన్నారు. 


Similar News