భీకర వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలం
* ఉగ్రరూపం దాల్చిన నదులు, వాగులు * నీటమునుగుతున్న తీర ప్రాంతాల గ్రామాలు * సోమశిల జలశయానికి ముంచుకస్తున్న వరదనీరు
Nivar Cyclone Live Update : నివర్ తుఫాన్ భీకర వర్షంతో నెల్లూరు జిల్లాపై దాడి చేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో నెల్లూరు జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గూడూరు వద్ద కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నాయుడుపేట - వెంకటగిరి మార్గంలో స్వర్ణముఖి ఉప్పొంగి పొర్లుతోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. నాయుడుపేట పూతలపట్టు శ్రీకాళహస్తి మార్గంలో భారీ వృక్షాలు నేలకూలాయి. పెన్నా నదికి ఇరువైపులా ఉన్న అనేక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. దీంతో ప్రజలను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తంగా గమనిస్తే జిల్లాలో ఎన్నడూ లేని విపత్కర పరిస్థితి నెలకొంది.