Nimmagadda Petition: మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు
Nimmagadda Petition: ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక ఎన్నికల సందర్భంగా గవర్నర్ కు రాసిన లేఖలు లీక్ చేసిన వ్యవహారం కాకరేపుతోంది.
Nimmagadda Petition: ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ధానిక ఎన్నికల సందర్భంగా గవర్నర్ కు రాసిన లేఖలు లీక్ చేసిన వ్యవహారం కాకరేపుతోంది. ఈ లేఖల ఆధారంగా తనకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న నిమ్మగడ్డ ఇప్పుడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడంతో మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ లేఖలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయో తేల్చేందుకు హైకోర్టు సిద్ధమైంది.
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ సందర్భంగా పదే పదే తనను టార్గెట్ చేస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణపై గవర్నర్ హరిచందన్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ లేఖలో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రులు ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే అధికారిక రహస్యంగా ఉండాల్సిన తన లేఖ ఎలా లీక్ అయిందో సీబీఐ దర్యాప్తు వేసి తేల్చాలంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ హరిచందన్‌కు రాసిన లేఖను తీసుకుని అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అధికార సంభాషణను ఎలా బయటపెట్టారంటూ వీరిని హైకోర్టు ప్రశ్నించింది. ఎస్ఈసీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వీరిద్దరూ వాడిన లేఖ ఎక్కడి నుంచి లీకయిందన్న దానిపై వీరిచ్చే వివరణ ఇప్పుడు కీలకంగా మారింది.
నోటిసులపై స్పందిచిన మంత్రి బొత్స సత్యానారాయణ కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు. నోటిసులకు సమాదానం ఇస్తామని స్పష్టం చేశారు. నిమ్మగడ్డకు సంబంధించిన రహస్యం ఏం బయటకు వచ్చిందో తనకు తెలియదన్నారు.