2019 సంవత్సరంలో దుమ్ము రేపారు వైఎస్ జగన్. మరి ట్వంటీ ట్వంటీలో ఎలాంటి ఇన్నింగ్స్ ఆడబోతున్నారు? ఆయన విసిరిన మూడు రాజధానుల గూగ్లీ, ఎలాంటి ప్రకంపలు రేపబోతోంది? మున్సిపల్, పంచాయతీ ఎన్నికల గ్రౌండ్‌లో అసెంబ్లీ రిజల్టే రిపీట్ అవుతుందా? కొత్తేడాదిలో జగన్ ముందున్న సవాళ్లేంటి? సానుకూలంగా కన్పిస్తున్న సంకేతాలేంటి?
2019లో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం సింహాసనం అధీష్టించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, 2020 ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి కలిగిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా రాజధాని అంశం, ట్వంటీ ట్వంటీలో కీలకం కాబోతోంది జగన్‌కు. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ది వికేంద్రీకరణ సాధ్యమని చెబుతున్న సీఎం జగన్, 2020 సంవత్సరంలో ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకే ముందుకెళ్లొచ్చని అందరూ అనుకుంటున్నారు. రాజధానుల వ్యవరహారం కొన్ని ప్రాంతాల్లో సంబరానికి కారణమవుతుంటే, అమరావతిలో మాత్రం ఉద్యమాన్ని హోరెత్తిస్తోంది. మరి 2020లో ఈ రెండింటినీ జగన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో, మూడు ప్రాంతాల ప్రజలను ఎలా ఒప్పిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.
2020లో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీ కాబట్టి అడ్వాంటేజీ వుండే అవకాశమే ఎక్కువ. అందులోనూ వ్యక్తిగత లబ్ది చేకూర్చే పథకాలకు శ్రీకారం చుట్టడం, అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం ఊపు ఇంకా కొనసాగుతుండటంతో, స్థానిక ఎన్నికలు కూడా జగన్ పార్టీకి వీర తిలకం దిద్దే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
2020లో సీఎం జగన్ పట్ల కేంద్రం ఎలాంటి తీరును కనబరుస్తుందన్నది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు, అభివృద్దికి కేంద్రం నుంచి సహకారం వస్తుందో లేదోనని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే జార్ఖండ్‌లో బీజేపీ పరాజయం, జగన్‌కు కొంత ఊరటనిచ్చిందంటున్నారు పొలిటికల్ పండితులు. కీలకమైన రాష్ట్రాల్లో అధికారం చేజారుతుండటంతో, బలమైన ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకోకూడదని బీజేపీ ఆలోచిస్తే, జగన్‌కు రిలీఫేనంటున్నారు విశ్లేషకులు. అలాగే కోర్టు కేసుల నుంచి కూడా, 2020లో జగన్‌కు ఊరట లభించే అవకాశముందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి 2020 సీఎం జగన్‌కు కొన్ని సవాళ్లు విసురుతుందని భావిస్తున్నా, అనేక అంశాల్లో పాజిటివ్ సంకేతాలే కనపడ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిపాలనా రాజధానిగా వైజాగ్‌ను ప్రకటిస్తే, ఏపీ క్యాపిటల్ బ్రాండ్ పెరుగుతుందని జగన్ లెక్కలేస్తున్నారు. చూడాలి, 2020 సీఎం జగన్‌కు ఎలాంటి గిఫ్టులు ఇవ్వబోతోందో.