ఏలూరుకు ఏమైంది..? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు..? ఇప్పటికే కరోనా విజృంభించి అల్లకల్లోలం సృష్టించగా మళ్లీ ఈ కొత్త వ్యాధి ఏంటి..? ఇప్పుడు ఇదే.. ఏలూరు ప్రజలకు టెన్షన్ పుట్టిస్తోంది. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వింత వ్యాధికి కారణం ఏంటనేది ఇప్పటివరకు స్పష్టంగా తేలడం లేదు.
అవును ఏలూరును వింత వ్యాధి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు కళ్లు తిరిగి పడిపోతున్నారు. కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే కింద పడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా బాధిత గ్రామాలు మూడుకు చేరుకున్నాయి. బాధితుల్లో ఎక్కువగా శ్వాస తీసుకోవడం, తల తిరగడం, కళ్లు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో ఎక్కవగా మహిళలు, చిన్నారులే ఉండటం ఆందోళన కల్గిస్తోంది.
బాధితుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో ఆసుపత్రిలోని బెడ్స్ నిండిపోతున్నాయి. దీంతో అధికారులు ప్రత్యే్క బెడ్స్‌ను కూడా సిద్ధం చేశారు. అటు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేని మాత్రం ఇప్పటికీ వరకు అధికారులు చెప్పలేకపోతున్నారు.
మూడురోజుల క్రితం భీమడోలు మండల పూళ్లగ్రామంలో ఏలూరు తరహాలో వింత వ్యాధి లక్షణాలతో పలువురు అస్వస్థతకు లోనయ్యారు. 16 మందికిపైగా అనారోగ్యం పాలవగా, వారిలో కొందరికి మూర్ఛ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. ఇక ఈ తరహా లక్షణాలతో అస్వస్థతకు గురి కావడం ఇటీవల తరచుగా జరుగుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలోని కొమిరేపల్లిలో ఏలూరు తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ప్రజలు వింతవ్యాధి లక్షణాలతో ఉన్నట్టుండి కిందపడిపోతున్నారు. దీంతో జనాలకు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే 13 మందికి తీవ్ర అస్వస్థత కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ అబ్బయ్య చౌదరి కొమిరేపల్లికి బయల్దేరారు.