Rain Update Today: బంగాళా ఖాతంలో అల్పపీడనం..నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Rain Update Today:బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది. ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Rain Update Today: ఆదివారం సాయంత్రం హైదరాబాద్ పరిసరాలతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ వారం వచ్చే వర్షాలతోపాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాగా తాజా బులిటెన్ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
దీనికి బలం ఇస్తూ రెండు తుఫాన్ తరహా సుడిగాలులు బంగాళాఖాతంపై ప్రభావం చూపుతున్నాయి. వీటిలో ఒకటి ఏపీ పక్కన తీర ప్రాంతంలో ఉండగా..మరొకటి మయన్మార్ దగ్గర ఉంది. వీటి వల్ల అల్పపీడనం వాయుగుండంగా, తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఏపీపై ద్రోణి ప్రభావం కూడా ఉంది.
ఈ పరిణామాల వల్ల ఈ వారం మొత్తం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే 22 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి. 23,24న రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉదయం నుంచి హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం 10 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడుతాయి. సాయంత్రం 4 గంటల తర్వాత తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాత్రి 7 గంటల తర్వాత రాయలసీమలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. రాత్రికి రెండు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈనెల 24వ తేదీన తెల్లవారుజామున 4గంటల వరకు వర్షాలు కురుస్తాయి.
గాలి మొత్తం అల్పపీడనం చుట్టూ తిరుగుతోంది. అల్పపీడనం పెద్దగా ఉంది. ఇది ఒడిశాలోని భువనేశ్వర్ తీరానికి దగ్గరలో ఉంది. అక్కడి నుంచి అది ఏకంగా విశాఖ తీరం వరకు విస్తరించి ఉంది. ఇది 24న ఒడిశాలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇది బెంగాల్, జార్ఖండ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో గాలి వేగం మాగ్జిమం గంటకు 40కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 18కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 11కిలోమీటర్ల వేగంగా ఉంది.
మొత్తంగా నేడు ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో మాత్రమే వర్షం పడుతుందని వాతారణ శాఖ చెబుతోంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.