తెలంగాణ అసెంబ్లీలో తనను గుర్తుచేసుకున్న కూనంనేనికి నవ్వుతూ బదులిచ్చిన చంద్రబాబు

తెలంగాణ అసెంబ్లీలో తనను గుర్తుచేసుకున్న కూనంనేనికి నవ్వుతూ బదులిచ్చిన చంద్రబాబు
Chandrababu Naidu about Kunamneni Sambashiva Rao's comments: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు "ఏ ఇజాలు లేవు.. ఇప్పుడంతా టూరిజమే" అని అనే వారు. "అప్పట్లో చంద్రబాబు ఆ మాటలు అన్నప్పుడు నిజంగానే ప్రతిపక్షంలో ఉన్న మాకు కోపం వచ్చేది. కానీ నిజంగానే పెద్దగా ఖర్చు లేకుండానే అభివృద్ధి చేసుకుని, ఆదాయం సంపాదించుకునే మార్గాల్లో టూరిజం కూడా ఒకటి" అని కూనంనేని అన్నారు. తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ కూనంనేని ఈ మాటలు అన్నారు.
అయితే, తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నవ్వుతూ స్పందించారు. కూనంనేని వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తుచేసుకుంటూ "ఆనాడు టూరిజం అభివృద్ధి గురించి తాను మాట్లాడితే సీపీఐ నేతలకు కోపం వచ్చేది. కానీ అది నిజం అని అర్థం చేసుకోవడానికి వారికి 30 ఏళ్లు పట్టింది" అని అన్నారు. ఏపీలో టూరిజం డెవలప్‌మెంట్ అంశాల గురించి కలెక్టర్లతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ నుండి కోనసీమ వరకు ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పర్యాటక కేంద్రాలకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌళిక వసతులు పెంచాలని గుర్తుచేశారు.